Viral Video: నిర్లక్ష్యానికి పరాకాష్ట.. విద్యార్ధుల సమాధాన పత్రాలు మూల్యాంకనం చేసిన ప్యూన్‌.. వీడియో

ఓ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపల్‌ నిర్లక్ష్యంతో విద్యార్ధుల బంగారు భవిష్యత్తుతో చలగాటం ఆడాడు. ఓవైపు పేదరికంతో అల్లాడుతూ మరోవైపు ఏడాదంతా కష్టపడి చదివి ఎన్నో కలలతో వార్షిక పరీక్షలు రాసిన విద్యార్ధుల ఆన్సర్ షీట్లను ఏ మాత్రం పరిజ్ఞానంలేని ప్యూన్‌తో దిద్దించడం వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోను కాలేజీ విద్యార్ధులు రికార్డు చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ భాగోతం బయటపడింది. ఈ షాకింగ్‌ ఘటన ఓ ప్రభుత్వ కాలేజీలో వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే..

Viral Video: నిర్లక్ష్యానికి పరాకాష్ట.. విద్యార్ధుల సమాధాన పత్రాలు మూల్యాంకనం చేసిన ప్యూన్‌.. వీడియో
Peon Caught Evaluating Answer Sheets

Updated on: Apr 10, 2025 | 5:07 PM

భోపాల్, ఏప్రిల్ 10: మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లా పిపారియాలోని షహీద్ భగత్ సింగ్ ప్రభుత్వ పీజీ కాలేజీలో వార్షిక పరీక్షల మూల్యాంకనం జరుగుతుంది. అయితే విద్యార్ధుల సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసేందుకు అధ్యాపకులు అందుబాటులో లేకపోవడంతో అక్కడే పనిచేస్తున్న పన్నాలాల్ పథారియా అనే ప్యూన్‌కు మూల్యాంకనం బాధ్యతలు అప్పగించారు. పథారియా ఇంగ్లిష్‌లో పీజీ పూర్తి చేశాడు. అయితే అతడు చేసే ఉద్యోగం ప్యూన్‌. సమాధానపత్రాలు దిద్దే బాధ్యత పూర్తిగా బోధనా సిబ్బందిది. కానీ పథారియా ఓ గదిలో కూర్చుని హిందీ సమాధాన పత్రాలపై టిక్‌ కొట్టడం, వాటికి మార్కులు వేయడం వంటి దృశ్యాలు విద్యార్ధుల కంటపడ్డాయి. అంతే వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నిజానికి అక్కడి హిందీఅతిథి లెక్చరర్‌గా పనిచేస్తున్న ఖుష్బూ పగారే అనే మహిళ వాటిని మూల్యాంకనం చేయవల్సి ఉంది. కానీ ఆనారోగ్య సమస్యల వల్ల ఆమె హాజరుకాలేదు.

దీంతో కాలేజీ బుక్ లిఫ్టర్ రాకేష్ కుమార్ మెహర్‌కు రూ.7 వేలు చెల్లించి మూల్యాంకన చేయాలని చెప్పింది. అయితే రాకేష్‌ ఆ పనిని కాలేజీలోని ప్యూన్‌కు అప్పగించి అతడికి రూ.5 వేలు ఇచ్చి, మిగతా రూ.2 వేలు తన వద్ద ఉంచుకున్నాడు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో విద్యార్ధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ వీడియోను స్థానిక ఎమ్మెల్యే ఠాకూర్ దాస్ నాగవంశీ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అధికారిక విచారణ తర్వాత ఉన్నత విద్యా శాఖ చర్యలకు ఉపక్రమించింది. విచారణలో తానే మూల్యాంకనం బాధ్యతలు అప్పగించినట్లు ఖుష్బూ పగారే అంగీకరించింది. దీంతో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ రాకేష్ కుమార్ వర్మ, మూల్యాంకన నోడల్ అధికారి ప్రొఫెసర్ రామ్‌గులం పటేల్‌లను వెంటనే సస్పెండ్ చేస్తూ శుక్రవారం (ఏప్రిల్ 4) ఉత్తర్వులు జారీ చేసింది. పగారే, మెహర్, పథారియాలను ఏప్రిల్ 8న విధుల నుంచి తొలగించారు. ఈ సంఘటన ఈ ఏడాది జనవరిలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

నా తప్పేంలేదు.. ప్రిన్సిపల్

కాలేజీ ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్న రాకేష్ కుమార్ వర్మ ఇప్పటికే గత మూడు నెలల్లో మూడుసార్లు సస్పెండ్ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా అతడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. అయితే తాజా ఘటన తర్వాత తనను అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నారని, కక్ష్య సాధింపు కోసమే స్థానిక రాజకీయ నాయకులు తనను ఈ వ్యవహారంలో ఇరికించారని చెప్పడం గమనార్హం. కాలేజీలో మూల్యాంకనంలో ఏం జరిగినా అది తన తప్పు ఎలా అవుతుందని? అది దర్యాప్తుకు సంబంధించిన విషయమని, కానీ దానిలో తన పాత్ర ఏంలేదని నిర్లక్ష్యంగా చెబుతున్నాడు. దీనిపై హైకోర్టును ఆశ్రయించి, గతంలో మాదిరి మళ్ళీ స్టే తెచ్చుకుంటానని చెప్పడం మరో వింత.

కాగా ఇప్పటికే ఆ కాలేజీల్లో మూల్యాంకన చేసిన సమాధాన పత్రాలను పునఃమూల్యాంకనం చేయిస్తామని, విద్యార్థులకు ఎటువంటి నష్టం జరగదని, గతంలో తనిఖీ చేసిన పత్రాలను సమర్థులైన అధ్యాపకులతో తిరిగి మూల్యాంకనం చేయిస్తామని ACS రాజన్ హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మళ్లీ ఈ విధమైన చర్యలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.