
హైదరాబాద్, అక్టోబర్ 21: దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి యేటా జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ జరిపి బీటెక్ సీట్లు భర్తీ చేస్తారు. ఐఐటీల్లో బీటెక్ చదవాలన్నా మెయిన్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి. జేఈఈలో అర్హత సాధించిన తొలి 2 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం ఇస్తారు. 2026-27 విద్యా సంవత్సరానికి జేఈఈ మెయిన్ 2026 తొలి విడత పరీక్షల షెడ్యూల్ తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారం జనవరి 21 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు, ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీ వరకు రెండో విడత పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు షిఫ్టుల్లో పరీక్ష జరుగుతుంది. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఆదివారం పరీక్షల తేదీలను ప్రకటించింది. గత ఏడాది కంటే ఈ సారి 10 రోజుల ముందుగానే ఈ పరీక్షల తేదీలను వెల్లడించడం విశేషం. అయితే ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఆ ప్రక్రియ కూడా ఈ నెలలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇందుకు సంబంధించి ఈ వారంలో లేదంటే వచ్చే వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక జేఈఈ మెయిన్ రెండో విడత పరీక్షలకు జనవరి చివరి వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలయ్యే అవకాశం ఉన్నట్లు ఎన్‌టీఏ తన ప్రకటనలో పేర్కొంది. కాగా జేఈఈ మెయిన్ పేపర్ 1, 2లకు కలిపి యేటా సుమారు 24 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేస్తుంటారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు లక్షన్నర మంది ఉంటారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే జేఈఈ పరీక్షలు యేటా విద్యార్ధులు పోటాపోటీగా తలపడుతుంటారు. బీటెక్‌లో చేరేందుకు జేఈఈ మెయిన్ పేపర్ 1, బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో చేరేందుకు పేపర్ 2 పరీక్ష రాయవల్సి ఉంటుంది.
ఈ ఏడాది నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలకు సంబంధించి పరీక్ష కేంద్రాలు, పట్టణాలు, నగరాల సంఖ్య కూడా పెంచే అవకాశం ఉన్నట్లు ఎన్టీయే తెలిపింది. ఈ మేరకు ఏర్పాట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. దివ్యాంగ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. నోటిఫికేషన్ వచ్చేలోపు ఆధార్ కార్డు, పదో తరగతి సర్టిఫికెట్‌లలోని వివరాలు ఒకేలా ఉండేలా అప్‌డేట్ చేసుకోవాలని, లేదంటే ఆ సమస్యను అధిగమించేందుకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ సమయంలో ఆప్షన్ ఇస్తామని పేర్కొంది. ఇక జేఈఈ మెయిన్ పరీక్షలు తెలుగు, ఇంగ్లిష్‌తో సహా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. పేపర్ 1 పరీక్ష 300 మార్కులకు, పేపర్ 2 పరీక్ష 400 మార్కులకు ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.