ఇక ఇంటర్వ్యూలు లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు.. విద్యార్హతలకు 50%.. రాత పరీక్షకు 50%.. వెయిటేజీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య యూనివర్సిటీల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే భర్తీ చేయాలని నిర్ణయించింది. విద్యార్హతలు, రాత పరీక్షల్లో సాధించిన ప్రతిభ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం..

ఇక ఇంటర్వ్యూలు లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు.. విద్యార్హతలకు 50%.. రాత పరీక్షకు 50%.. వెయిటేజీ
No More Interviews For Telangana Professor Jobs

Updated on: Jul 09, 2026 | 3:23 PM

హైదరాబాద్‌, జులై 9: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ కొలువుల భర్తీలో తొలిసారి కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య యూనివర్సిటీల్లో తొలిసారిగా ఇంటర్వ్యూలు లేకుండా ప్రొఫెసర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. విద్యార్హతలు, రాత పరీక్షకి 50 మార్కుల చొప్పున కేటాయించి మొత్తం 100 మార్కులకు సెలక్షన్‌ ప్రోసెస్‌ ఉండనుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 1000 ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీకి రంగం సిద్ధం చేస్తుంది.

అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో 48 ప్రొఫెసర్ పోస్టులు, 148 అసోసియేట్ పోస్టులు, 370 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల చొప్పున మొత్తం 566 పోస్టులను భర్తీ చేస్తుంది. ఇక ఉద్యాన యూనివర్సిటీలో 17 ప్రొఫెసర్ పోస్టులు, 44 అసోసియేట్ పోస్టులు, 79 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు కలిపి మొత్తం 140 పోస్టులు, పశువైద్య యూనివర్సిటీలో 235 పశువైద్య పోస్టులు, 20 డెయిరీ పోస్టులు, 39 మత్య్సశాఖ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు కలిపి మొత్తం 294 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆమోదం కూడా వచ్చేసింది. ఇంటర్వ్యూలు లేకుండా ఈ పోస్టులను భర్తీ చేయాలనే సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల ప్రకారం.. దీనికి అనుగుణంగా అగ్రి యూనివర్సిటీ విధివిధానాల రూపకల్పన చేసి ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వం నుంచి ఆమోదం లభించిన అనంతరం నియామకాలకు వరుస నోటిఫికేషన్‌లు జారీ చేస్తారు.

ఒక వేళ అగ్రి యూనివర్సిటీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపితే ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎలా ఉంటుందంటే..?

అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియలో విద్యార్హతలకు గరిష్ఠంగా 50 శాతం మార్కులు ఉంటాయి. ఇందులో బ్యాచిలర్‌ డిగ్రీకి 10 శాతం, మాస్టర్స్‌ డిగ్రీ 15 శాతం, పీహెచ్‌డీ 5 శాతం, అంతర్జాతీయ సంస్థల్లో ఫెలోషిప్‌ 5 శాతం, గోల్డ్‌ మెడల్‌ సాధించిన వారికి 3 శాతం, జర్నల్స్‌లో ఆర్టికల్స్‌ 4 శాతం, ఆవిష్కరణలు, పేటెంట్లు 4 శాతం, పరిశోధన సంస్థల్లో అనుభవం 4 శాతం చొప్పున వెయిటేజీ ఉంటుంది. ఇక మిగిలిన 50 మార్కులను రాత పరీక్షకు కేటాయిస్తారు. అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ పోస్టులకు ఐకార్, యూజీసీ నిబంధనలను అనుసరించి విద్యార్హతలకు ఏకంగా 80 శాతం మార్కులు కేటాయించి, మిగిలిన 20 మార్కులను డెమోలెక్చర్‌కు 20 శాతం మార్కులు కేటాయించనున్నారు.

Follow Us