NEET Re Exam 2026: నీట్ రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డులో బిగ్ మిస్టేక్.. నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో పరీక్ష కేంద్రం కేటాయింపు!

NEET UG 2026 రీ-ఎగ్జామ్‌కు సిద్ధమైన నాగ్‌పూర్ విద్యార్థికి అడ్మిట్ కార్డులో అబుదాబి పరీక్షా కేంద్రం కేటాయించడంతో కలకలం రేగింది. సాంకేతిక లోపమే కారణమని అంగీకరించిన NTA, కొత్త అడ్మిట్ కార్డు జారీ చేసి నాగ్‌పూర్‌లోనే కేంద్రం కేటాయిస్తామని హామీ ఇచ్చింది.

NEET Re Exam 2026: నీట్ రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డులో బిగ్ మిస్టేక్.. నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో పరీక్ష కేంద్రం కేటాయింపు!
NEET Admit Card Error

Updated on: Jun 20, 2026 | 12:27 PM

రేపటి (జూన్ 21) NEET UG 2026 రీ-ఎగ్జామ్‌కు ముందు మరో కీలక పొరపాటు వెలుగులోకి వచ్చింది. NTA జారీ చేసిన అడ్మిట్ కార్డుల్లో కొన్ని సాంకేతిక లోపాలు కనిపించగా, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ విద్యార్థికి కేటాయించిన పరీక్షా కేంద్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నాగ్‌పూర్‌కు చెందిన అబ్దుల్లా మహ్మద్ తాలిబ్ అనే విద్యార్థి రీ-ఎగ్జామ్ కోసం అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులో పేర్కొన్న పరీక్షా కేంద్రాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. తనకు సమీపంలోని నగరంలో కాకుండా, ఏకంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని అబూదాబిలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించినట్లు అడ్మిట్ కార్డులో పేర్కొనబడింది. అబ్దుల్లా దరఖాస్తు సమయంలో పరీక్షా కేంద్రాల ఎంపికలో నాగ్‌పూర్, వర్ధా, భండారా జిల్లాలను మాత్రమే ఎంపిక చేసినట్లు అతని తండ్రి తెలిపారు. అయితే అడ్మిట్ కార్డులో అబుదాబిలోని ఓ భారతీయ పాఠశాలను పరీక్షా కేంద్రంగా చూపించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

విదేశాలకు వెళ్లాలన్నా ఆ విద్యార్థి వద్ద పాస్‌పోర్ట్ కూడా లేకపోవడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. దీంతో వెంటనే అతడి తండ్రి NTA అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారగా, NTA అధికారులు స్పందించారు. ఇది సాంకేతిక పొరపాటు వల్ల జరిగిందని, విద్యార్థికి నాగ్‌పూర్‌లోనే పరీక్షా కేంద్రం కేటాయిస్తామని స్పష్టం చేశారు. సవరించిన వివరాలను ఈ సాయంత్రంలోపు అందజేస్తామని తెలిపారు. రేపు(ఆదివారం) జరగనున్న రీ-ఎగ్జామ్‌కు ముందు ఇలాంటి పొరపాటు బయటపడటం అభ్యర్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే సమస్యను వెంటనే పరిష్కరిస్తామని NTA హామీ ఇవ్వడంతో విద్యార్థి కుటుంబం ఊరట పొందింది.

‘పాస్‌పోర్ట్ కూడా లేదు.. ఎలా వెళ్తాం?

అంతకుముందు ఈ విషయంపై అబ్దుల్లా తండ్రి మాట్లాడుతూ.. “నిన్న సాయంత్రం 4 గంటలకు అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసిన తర్వాత అబుదాబిలోని స్కూల్‌ను పరీక్షా కేంద్రంగా చూపించడం చూసి మేమంతా షాక్ అయ్యాం. అలాంటి ఎంపికను మేమెప్పుడూ ఇవ్వలేదు. వెంటనే NTA హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయగా, ఇమెయిల్ పంపాలని సూచించారు. ఇమెయిల్ పంపిన తర్వాత అధికారులు ఫోన్ చేసి శనివారం సాయంత్రం 4 గంటలలోపు కొత్త అడ్మిట్ కార్డు జారీ చేస్తామని చెప్పారు” అని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

సాంకేతిక లోపమే కారణం: NTA

ఈ ఘటన సోషల్ మీడియాలో, మీడియాలో ప్రాధాన్యం పొందడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పందించింది. పరీక్షా కేంద్రం కేటాయింపులో జరిగిన ఈ తప్పు సాంకేతిక లోపం (Technical Glitch) కారణంగా జరిగిందని అంగీకరించింది. విద్యార్థి కుటుంబానికి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన NTA, వివరాలను ధృవీకరించిన అనంతరం కొత్త అడ్మిట్ కార్డు జారీ చేసి, నాగ్‌పూర్‌లోనే తగిన పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తామని తెలిపింది.

జూన్ 21న రీ-నీట్ పరీక్ష

RE-NEET UG 2026 పరీక్ష జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పెన్-అండ్-పేపర్ విధానంలో నిర్వహించనున్నారు.

అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకున్న అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, పరీక్షా కేంద్రం, పరీక్ష తేదీ, సమయం వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని అధికారులు సూచించారు. ఏవైనా పొరపాట్లు కనిపిస్తే వెంటనే NTA హెల్ప్‌లైన్ లేదా అధికారిక ఇమెయిల్ ద్వారా తెలియజేయాలని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: NEET UG 2026 రీ-ఎగ్జామ్ రేపే.. నేడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్, అభ్యర్థులకు NTA కీలక సూచనలు

 

Follow Us