రెండేళ్లకే తండ్రి, పదేళ్లకే తల్లి మృతి.. కష్టాలను ఎదిరించి NEETలో మెరిసిన అనాథ విద్యార్ధిని

NEET 2026 Success Journet: కష్టాలు ఎంత ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగితే విజయాన్ని సాధించవచ్చని నిర్మల్ జిల్లాకు చెందిన విద్యార్ధిని తోకల ముత్తవ్వ నిరూపించింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమె, జీవితంలోని ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి నీట్ యూజీ 2026లో మంచి ర్యాంకు సాధించి తన డాక్టర్‌ కల వైపు అడుగులు వేస్తోంది. పేదింట పుట్టి ఒంటరిగా అడుగులు వేసిన ఈ అమ్మాయి కథ విద్యార్ధులకు స్ఫూర్తిని ఇస్తోంది..

రెండేళ్లకే తండ్రి, పదేళ్లకే తల్లి మృతి.. కష్టాలను ఎదిరించి NEETలో మెరిసిన అనాథ విద్యార్ధిని
Orphan Student Secured NEET rank

Updated on: Jul 19, 2026 | 8:31 AM

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం లోశ్ర గ్రామానికి చెందిన ముత్తవ్వ బీసీ-ఏ వర్గానికి చెందిన విద్యార్థిని. ఆమెకు రెండేళ్ల వయసున్నప్పుడు తండ్రి, పదేళ్ల వయసులో తల్లి అనారోగ్యంతో మరణించారు. దీంతో బాబాయి, మామ ఆమె సంరక్షణ బాధ్యతలు చేపట్టి చదువులో ముందుకు నడిపించారు. నాలుగో తరగతి వరకు స్వగ్రామంలో చదివిన ముత్తవ్వను ఐదో తరగతి నుంచి ఖానాపూర్ బీసీ గురుకుల పాఠశాలలో చేర్పించారు. అక్కడే పాఠశాల విద్య పూర్తి చేసిన ముత్తవ్వ.. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించింది. ఆ ప్రతిభతో సరూర్‌నగర్ బీసీ గురుకుల బాలికల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లో ప్రవేశం పొందింది.

ఇంటర్మీడియట్‌లో 979 మార్కులు సాధించిన ముత్తవ్వ, వైద్యురాలిగా మారాలనే తన కలను నిజం చేసుకునేందుకు నీట్ పరీక్షకు సిద్ధమైంది. ఆమె కుటుంబ పరిస్థితులను గుర్తించిన బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ప్రత్యేక మార్గదర్శకత్వం అందించారు. ఉపాధ్యాయుల సహకారం, స్వయంకృషితో నీట్-యూజీ 2026లో 406 మార్కులు సాధించింది. ఈ పరీక్షలో ముత్తవ్వ జనరల్ ర్యాంకు 2,58,017 రాగా. ఓబీసీ కేటగిరీ ర్యాంకు 1,22,138 సాధించింది. రాష్ట్రంలో కన్వీనర్ కోటా ద్వారా ఎంబీబీఎస్ సీటు లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

‘నా తల్లిదండ్రులు సరైన వైద్య సదుపాయాలు లేక అనారోగ్యంతో మరణించారు. అలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదనే ఉద్దేశంతో వైద్యురాలిని కావాలని నిర్ణయించుకున్నాను. ముఖ్యంగా పేద మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉంది. భవిష్యత్తులో గైనకాలజిస్టుగా మారి సమాజానికి సేవ చేయడమే నా లక్ష్యం’ అని విద్యార్ధిని ముత్తవ్వ ఆనందం వ్యక్తం చేసింది. తల్లిదండ్రులను కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, విద్యనే ఆయుధంగా చేసుకుని ముందుకు సాగుతున్న ముత్తవ్వ కథ మనలో ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. నిజమే కదా.. మీరేమంటారు!

Follow Us