NEET ఫలితాల్లో OMR షీట్ల గోల్‌మాల్.. 707 మార్కులొస్తే రిజల్ట్స్‌లో మాత్రం 217 స్కోర్..!

ఈ ఏడాది దేశాన్ని ఊపేసిన సంఘటనల్లో నీట్ పరీక్ష ఒకటి. మే 3న నిర్వహించిన నీట్‌ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా రద్దు కాగా.. జూన్ 21న మళ్లీ ఈ పరీక్షను కట్టుదిట్టంగా నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఇంతటితో నీట్ గొడవ సర్దుమనిగిందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది..

NEET ఫలితాల్లో OMR షీట్ల గోల్‌మాల్.. 707 మార్కులొస్తే రిజల్ట్స్‌లో మాత్రం 217 స్కోర్..!
NEET OMR Sheet Controversy

Updated on: Jul 20, 2026 | 12:10 PM

పుణే, జులై 20: నీట్‌ (NEET) పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయని పలువురు విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) శనివారం నిర్వహించిన విచారణలో పలు ఓఎంఆర్‌ (OMR) షీట్లలో మార్పులు జరిగినట్లు తేల్చింది. ఒక కేసులో ఓఎంఆర్‌ షీట్‌ పూర్తిగా కృత్రిమ మేధస్సు (AI) సాయంతో రూపొందించబడిందని, మరో కేసులో షీట్‌ను తారుమారు అయినట్లు ఎన్టీఏ అధికారులు కూడా అంగీకరించారు. విచారణ అనంతరం తప్పుడు ఆరోపణలు చేస్తూ, పరీక్షా వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి మార్పులు చేసిన పత్రాలను ఉపయోగిస్తున్న అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ హెచ్చరించింది.

అసలు ఈ వివాదం పుణేకు చెందిన ఓ విద్యార్థి ఫిర్యాదుతో ప్రారంభమైంది. జూలై 13 రాత్రి ఎన్టీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న ఓఎంఆర్‌ షీట్‌ ఒకటి, జూలై 15న ఈమెయిల్‌ ద్వారా అందిన మరో ఓఎంఆర్‌ షీట్‌ ఒకటి తనకు అందాయని అతను పేర్కొన్నాడు. రెండింటిపైనా తన పేరు ఉన్నప్పటికీ, సమాధానాలు భిన్నంగా ఉన్నాయని తెలిపాడు. జూలై 13న తన కుమారుడు డౌన్‌లోడ్‌ చేసిన ఓఎంఆర్‌ షీట్‌ను అధికారిక ఆన్సర్‌ కీతో సరిపోల్చి చూసినప్పుడు అతనికి 720 మార్కులకు గాను 707 మార్కులు రావాల్సి ఉందని లెక్కించాం. కానీ ఫలితాలు ప్రకటించినప్పుడు రెండో ఓఎంఆర్‌ షీట్‌ ఆధారంగా కేవలం 217 మార్కులే వచ్చినట్లు చూపించారని విద్యార్థి తండ్రి తెలిపారు.

మరోవైపు బీడ్‌కు చెందిన ఓ విద్యార్థి కూడా తన ఓఎంఆర్‌ షీట్‌ ఎన్టీఏ అప్‌లోడ్‌ చేసిన దానితో సరిపోలుతున్నప్పటికీ తనకు కేవలం 95 మార్కులు మాత్రమే ఇచ్చారని ఆరోపించాడు. తుది ఆన్సర్‌ కీ ప్రకారం తనకు 522 మార్కులు రావాల్సి ఉందని అతను పేర్కొన్నాడు. పుణే విద్యార్థి సమర్పించిన పత్రాలను పరిశీలించిన అనంతరం ఆ ఓఎంఆర్‌ షీట్‌ పూర్తిగా ఏఐ ద్వారా సృష్టించబడినదని ఎన్టీఏ తేల్చింది. బీడ్‌ విద్యార్థి కేసులో మాత్రం ఓఎంఆర్‌ షీట్‌ను తారుమారు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై ఎన్టీఏ తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతాలో స్పందిస్తూ.. ‘అన్ని ఫిర్యాదులను నిశితంగా పరిశీలిస్తున్నాం. పరిశీలన కోసం సమర్పించిన ఓఎంఆర్‌ షీట్లలలో అనేకం నకిలీవి. వీటిని ఏఐతో రూపొందించినవిగా గుర్తించాం. విద్యార్థులు, తల్లిదండ్రులు అసలైన ఓఎంఆర్‌ షీట్లను మాత్రమే సమర్పించాలి. నకిలీ, ఏఐతో రూపొందించిన ఓఎంఆర్‌ షీట్లు సమర్పిస్తే ఫిర్యాదుదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని’ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

కాగా ఈ ఏడాది సుమారు 20 లక్షల మంది విద్యార్థులు నీట్‌ పరీక్షకు హాజరుకాగా, వారిలో 11.21 లక్షల మంది ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుష్‌ అనుబంధ అండర్‌గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు.

Follow Us