NMC warns medical college hospitals against charging fee for internship: ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్ ఫీజు వసూలు చేస్తున్న మెడికల్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాల వైద్య విద్యా సంచాలకుల (DME)కు జాతీయ మెడికల్ కమిషన్ (NMC) ఆదేశాలు జారీ చేసింది. పైగా ఇంటర్న్‌షిప్ చేస్తున్న విద్యార్థులకు స్టైపెండ్ ఇవ్వకపోవడంపైనా మండిపడింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటర్న్‌షిప్ ఫీజు (MBBS Internship fee) వసూలు చేయకూడదని, స్టైపెండ్ అందేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్‌ఎంసీ అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్ జారీ చేసింది. విదేశాల్లో, దేశంలో చదివిన వారి నుంచి కూడా కాలేజీలు ఫీజు వసూలు చేస్తున్నాయన్న సమాచారం తమకు అందిందని పేర్కొంది. ఈ విషయంపై అన్ని మెడికల్ కాలేజీలను ఒకసారి తనిఖీ చేయాలని రాష్ట్రాలకు సూచించింది.
ఒక వేళ ఎన్‌ఎమ్‌సీ ఆదేశాలను ఎక్కడైనా ధిక్కరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు ఇంటర్న్‌షిప్ శిక్షణ నిమిత్తం కొన్ని గ్రామీణ ఆరోగ్య కేంద్రాలనే కాలేజీలు ఎంచుకుంటున్నాయని, దీంతో ఒకే చోట ఎక్కువ మంది శిక్షణ పొందుతున్నారని ఎన్‌ఎంసీ ఆక్షేపించింది. ఓ కేంద్రంలో 15 మంది ఇంటర్న్‌షిప్‌లకు మించరాదని స్పష్టం చేసింది. ఐతే ఆరోగ్య కేంద్రాల కొరత కారణంగా కొన్ని చోట్ల ఇలా జరుగుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. వాస్తవానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో శిక్షణ పొందుతున్న ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్లకు కూడా సమాన స్టైపెండ్, ఇతర సౌకర్యాలు చెల్లిస్తామని ఎన్‌ఎంసీ గతంలోనే వెలడించింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.