గత కొన్ని రోజులుగా ఉద్యోగ కల్పనలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతోన్న విషయం తెలిసిందే. ఆర్థిక మాంద్యం తప్పదన్న వార్తల నేపథ్యంలో చాలా వరకు కంపెనీలు ఉద్యోగాల నియామకాన్నీ పూర్తి తగ్గించేశాయి. మరీ ముఖ్యంగా క్యాంపస్ నియామకాలు భారీగా తగ్గాయి. ఫ్రెషర్స్‌కి ఉద్యోగాలు రావడమే గగనంగా మారింది. కొన్ని కంపెనీలు ఉద్యోగులను నియమించుకున్నా ఆఫర్ లెటర్స్ ఇవ్వలేదు. దీంతో ఇక రానుంది అంత గడ్డు కాలమే అనే వాదనలు వినిపించాయి.
అయితే తాజాగా వెలువడిన ఓ నివేదిక నిరుద్యోగులకు ఊరటనిస్తోంది. ఫ్రెషర్స్‌కి భారీగా అవకాశాలు పెరగనున్నాయని తెలుస్తోంది. కంపెనీలు క్రమంగా మళ్లీ నియామకాలను పెంచుతున్నాయని టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ నివేదికలో వెల్లడించింది. జులై-డిసెంబర్ 2024కి సంబంధించిన నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. కంపెనీలు ఫ్రెషర్స్‌కి ప్రాధాన్య ఇవ్వనున్నాయని నివేదిక చెబుతోంది. నియామక సంస్థల్లో సుమారు 72 శాతం ఈ సంస్థలు ఈ విషయాన్ని పేర్కొన్నాయని నివేదికలో పేర్కొన్నారు.
అయితే గతేడాదితో పోల్చితే ఇది 7 శాతం అధికం కావడం విశేషం. ఫ్రెషర్స్‌కి ప్రాధాన్యతనిస్తూ ఉద్యోగ కల్పన పెరుగుతుందని నివేదికలో తెలిపారు. ఈ విషయమై టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ వ్యవస్థాపకులు, సీఈఓ శంతను రూజ్ ఈ విషయమై మాట్లాడుతూ.. ఉద్యోగాల్లో చేరాలనుకునే ఉన్నత విద్యావంతులకు మంచి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 603 కంపెనీలను సంప్రదించి, ఈ నివేదికను రూపొందించినట్లు పేర్కొన్నారు.
ముఖ్యంగా ఇ-కామర్స్, టెక్నాలజీ స్టార్టప్ కంపెనీలు, ఇంజనీరింగ్, రిటైల్ సంస్థలు ఫ్రెషర్లను నియమించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని నివేదికలో వెల్లడైంది. ఇక నగరాల పరంగా చూస్తే బెంగళూరులో 74 శాతం కంపెనీలు, ముంబయిలో 60 శాతం కంపెనీలు, చెన్నైలో 54 శాతం కంపెనీలు ఫ్రెషర్స్‌ని నియమించుకునేందుకు ముందుకు వస్తున్నాయని తేలింది. ఫుల్-స్టాక్ డెవలపర్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎగ్జిక్యూటివ్, డిజిటల్ సేల్స్ అసోసియేట్, యూజర్ ఇంటర్‌ఫేజ్ డిజైనర్ నైపుణ్యాలు ఉన్న వారికి ఉద్యోగవకాశలు ఎక్కువగా ఉన్నట్లు ఈ నివేదికలో వెల్లడించారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..