కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు కోరుకునే తల్లిదండ్రులకు గుడ్ న్యూస్. 2021-22 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల షెడ్యూల్‌ను ప్రకటించింది కేంద్రీయ విద్యాలయ సంఘటన్. 1వ తరగతిలో అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2021 ఏప్రిల్ 1న ప్రారంభం కానుంది. ఏప్రిల్ 19 లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అధునాతన సాంకేతిక విద్యా బోధనకు వేదికలైన కేంద్రియ విద్యాలయాల్లో (KV) ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ప్రక్రియ కొంత ఆలస్యమైంది.
2021-22 విద్యా సంవత్సరానికి వచ్చే నెల 1 నుంచి మే 31వ తేదీకి ఇంటర్మీడియట్ మినహాయించి మిగిలిన అన్ని తరగతుల్లో ప్రవేశాలు పూర్తి చేసేందుకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకటో తరగతిలో చేరితే ఇంటర్మీడియట్ వరకు చదువుకోవచ్చు. దీంతో సీట్లు పొందేందుకు విపరీతమైన పోటీ ఉంటుంది. ఖాళీలు పదుల సంఖ్యలో ఉంటే దరఖాస్తులు వందలు, వేలల్లో వస్తున్నాయి.
ఒకటవ తరగతి అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అధికారిక వెబ్‌సైట్ kvsonlineadmission.kvs.gov.in. లో తెలుసుకోవచ్చు.
ఒకటో తరగతిలో ప్రవేశాలకు వచ్చే నెల 1వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమై 19వ తేదీ సాయంత్రం 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం ఉంటుంది. రెండో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీలను వచ్చే నెల 8వ తేదీ నుంచి 15వ తేదీలోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు వెల్లడైన 30 రోజుల్లోపు ఇంటర్మీడియెట్‌లో ఖాళీలను భర్తీ చేస్తారు.
ఇక ఇక 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు 2021 ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 15 వరకు జరగనున్నాయి. ఈ అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అధికారిక వెబ్‌సైట్ kvsonlineadmission.kvs.gov.in. లో తెలుసుకోవచ్చు. అధికారిక సమాచారం కోసం కేవీ సంఘటన్ వెబ్‌సైట్‌ను మాత్రమే చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులను కేవీ అధికారులు తెలిపారు.