Success Story: కేరళ అమ్మాయికి రూ.కోటిన్నర ఫెలోషిప్‌.. కఠినమైన పోటీలో అరుదైన విజయం!

పట్టుదల, నిరంతర శ్రమ ఉంటే అంతర్జాతీయ స్థాయిలోనూ విజయాలు సాధించవచ్చని నిరూపించారు కేరళకు చెందిన యువ శాస్త్రవేత్త ఆన్ సన్నీ. యూరోపియన్ యూనియన్ అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మేరీ క్యూరీ ఫెలోషిప్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. మూడేళ్ల పరిశోధన కోసం సుమారు రూ.1.5 కోట్ల మేర ఆర్థిక సహాయం అందుకోనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన కఠినమైన ఎంపిక ప్రక్రియలో ప్రపంచవ్యాప్తంగా పోటీపడిన 32 మంది అభ్యర్థుల్లో ఆన్ సన్నీ ఒక్కరే ఎంపిక కావడం విశేషం. ఈ ఫెలోషిప్‌లో భాగంగా ఆమె ఇటలీ రాజధాని రోమ్‌లోని నికోలో కుసానో విశ్వవిద్యాలయంలో పరిశోధనలు కొనసాగించనున్నారు..

Success Story: కేరళ అమ్మాయికి రూ.కోటిన్నర ఫెలోషిప్‌.. కఠినమైన పోటీలో అరుదైన విజయం!
Kerala Young Scientist Anne Sunny

Updated on: Aug 09, 2026 | 10:45 AM

ఆన్ సన్నీ పరిశోధనలు ప్రధానంగా బయోసెరామిక్స్ రంగంపై కొనసాగనున్నాయి. ఈయూ రెనోవేట్ ప్రాజెక్టులో భాగంగా ఎముకలకు సంబంధించిన రుమటాయిడ్ వ్యాధుల నివారణ, చికిత్సకు ఉపయోగపడే బయోసెరామిక్ పదార్థాలపై ఆమె పరిశోధనలు చేయనున్నారు. కీళ్లు, ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న రోగులకు మరింత మెరుగైన వైద్య విధానాలను అభివృద్ధి చేయడంలో ఈ పరిశోధనలు కీలకంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎముకల పునరుద్ధరణ, వ్యాధుల చికిత్సలో ఉపయోగపడే కొత్త విధానాల అభివృద్ధికి ఆమె పరిశోధనలు దోహదపడనున్నాయి.

చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ

కేరళలోని త్రిసూర్ జిల్లా నెల్లంకరకు చెందిన ఆన్ సన్నీ చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచారు. ఆమె తండ్రి పనక్కల్ తారు సన్నీ షార్జాలో ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, తల్లి లిండా సన్నీ న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. ఆమెకు ముగ్గురు సోదరులు ఉన్నారు. షార్జా ఇండియన్ స్కూల్‌లో ప్లస్‌టూ విద్యను పూర్తి చేసిన ఆన్ సన్నీ, అనంతరం దిల్లీలోని శ్రీ వేంకటేశ్వర కళాశాలలో కెమిస్ట్రీ ఆనర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. డిగ్రీ చదువుతున్న సమయంలోనే పరిశోధనపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ సమయంలో ఆమె సమర్పించిన పరిశోధనా పత్రం ప్రముఖ అంతర్జాతీయ మాసపత్రికలో ప్రచురితమైంది.

బయోసెరామిక్స్‌పై ఆసక్తి

డిగ్రీ అనంతరం వెల్లూరులోని వీఐటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశారు. అక్కడే బయోసెరామిక్స్ విభాగంలో పరిశోధనలు ప్రారంభించారు. ఎముకలు, కీళ్లకు సంబంధించిన సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలను కనుగొనే దిశగా ఆమె పరిశోధనలు సాగాయి. ఇప్పటికే ప్రారంభించిన పరిశోధనలను మరింత విస్తృత స్థాయిలో కొనసాగించేందుకు మేరీ క్యూరీ ఫెలోషిప్ ద్వారా ఇటలీ వెళ్లనున్నారు. అంతర్జాతీయ పరిశోధనా వేదికపై తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఆమెకు లభించింది.

మేరీ క్యూరీ ఫెలోషిప్ సాధించడం ఆన్ సన్నీ వ్యక్తిగత విజయమే కాకుండా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని కలలు కనే యువతకు స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా నిలుస్తోంది. ప్రతిభతో పాటు పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర పరిశోధన, లక్ష్యంపై దృష్టి ఉంటే అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని ఆన్ సన్నీ ప్రయాణం తెలియజేస్తోంది. ఎముకలు, కీళ్ల వ్యాధుల చికిత్సలో కొత్త మార్గాలను అన్వేషించనున్న ఆమె పరిశోధనలు భవిష్యత్తులో ఎంతోమంది రోగులకు ప్రయోజనం చేకూర్చాలని కోరుకుందాం..

Loading...
Unable to load recommendations.
Follow Us