Google Job: ‘మొండితనానికి, పిచ్చితనానికి మధ్య సన్నని గీత ఉంది. ఈ రెండింటిలో ఏది నాకు ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను’ ఇది టేలర్ కోహెన్ చెప్పిన మాట. ఇంతకీ ఈ టైలర్ కోహెన్ ఎవరు అని ఆలోచిస్తున్నారా? అయితే, ఈ సక్సెస్ స్టోరీ చదవాల్సిందే. టేలర్ కోహెన్ మాట్లాడే ఆ సన్నని గీత విజయంపై ఆధారపడి ఉంటుంది. మొండితనం వల్ల విజయం సాధిస్తే అందరూ మెచ్చుకుంటారు. అయితే ఎంత గట్టిగా ప్రయత్నించినా సక్సెస్ రాకపోతే పిచ్చితనం అని కూడా వెటకారం చేస్తారు జనాలు.
టేలర్ కోహెన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. Google అతన్ని 39 సార్లు తిరస్కరించింది. అయినప్పటికీ నిన్ను వదల బొమ్మాలీ అన్న డైలాగ్‌ను వంటపట్టుకున్నాడో ఏమో కానీ.. మళ్లీ మళ్లీ జాబ్ కోసం అప్లై చేస్తూనే వచ్చాడు. ఇన్నిసార్లు రిజెక్ట్ అయినా మళ్లీ మళ్లీ అప్లై చేస్తుండటంతో.. ఒకానొక సమయంలో తనను తాను పిచ్చివాడిగా భావించాడు కోహెన్. అయినప్పటికీ, అతను గూగుల్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేయడం మానలేదు. అమెరికన్ ఫుడ్ డెలివరీ కంపెనీ డోర్‌డాష్‌లో అసోసియేట్ మేనేజర్-స్ట్రాటజీ, ఆపరేషన్స్‌గా పనిచేసిన కోహెన్, తన 40వ దరఖాస్తు తర్వాత గూగుల్‌లో జాబ్ సంపాదించాడు.
ప్రయాణం ఇలా సాగింది..
కోహెన్ Google స్క్రీన్‌షాట్‌లను, అక్కడి నుండి పంపిన ఇమెయిల్‌లను కూడా షేర్ చేశాడు. అతను మొదట 25 ఆగస్టు 2019న Googleకి అప్లై చేశాడు. కానీ గూగుల్ ఆ అప్లికేషన్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత 2019 సెప్టెంబర్‌లో రెండుసార్లు అప్లై చేసుకున్నాడు. ఈసారి కూడా తిరస్కరించారు. కొంతకాలం విరామం తీసుకుని జూన్ 2020లో మళ్లీ అప్లై చేసుకున్నాడు. ఇలా మొత్తం 39 సార్లు అప్లై చేయగా.. అన్నిసార్లు గూగుల్ అతని అప్లికేషన్‌ను రిజెక్ట్ చేసింది. చివరగా, 19 జూలై 2022న, గూగుల్ అతనికి ఉద్యోగం ఇస్తూ మెయిల్ పంపింది. 40వ సారి దరఖాస్తు చేసుకున్న తరువాత అతనికి ఈ అవకాశం లభించింది.
మరిన్ని జాబ్స్&కెరీర్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..