నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటే ఆ రంగాల్లో ఉద్యోగాలకు ఢోకా లేదు.. RBI మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్

నైపుణ్యాలు మెరుగుప‌ర్చుకుంటే అనేక రంగాల్లో ఉద్యోగ అవ‌కాశాలు ఉన్నాయ‌ని రిజ‌ర్వు బ్యాంక్ మాజీ గ‌వ‌ర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి కోసం పోషకాహార లోపం స‌మ‌స్యను త‌గ్గించుకోవాల‌ని ఆయ‌న సూచించారు. తెలంగాణ భ‌విష్యత్తు ప్రణాళిక పైన నిర్వహించిన స‌మావేశంలో రఘురామ్ రాజన్ ప‌లు సూచ‌న‌లు చేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జ‌రిగిన స‌మావేశంలో రఘురామ్ రాజన్ తో పాటు డీప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క, ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి శ్రీధ‌ర్ బాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు..

నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటే ఆ రంగాల్లో ఉద్యోగాలకు ఢోకా లేదు.. RBI మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్
Former Rbi Governor Raghuram Rajan

Updated on: May 05, 2026 | 9:20 PM

హైద‌రాబాద్, మే5: ప్రభుత్వాల సుల‌భ‌త‌ర వ్యాపార విధానం మీద ఆధార‌ప‌డి కొత్త ప‌రిశ్రమ‌లు, పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని రఘురామ్ రాజన్ అన్నారు. అయితే స్టార్టప్ ల‌ను ఎక్కువ ప్రోత్సహిస్తే మ‌రింత ఉప‌యోగం ఉంటుంద‌ని ఆయ‌న సూచించారు. పాఠ‌శాల‌, ఉన్నత‌, సాంకేతిక విద్యతో పాటు వైద్య విద్య సిల‌బ‌స్ లో ఏఐ ఉప‌యోగంపైన క‌మిటీ ఏర్పాటు చేస్తామ‌ని, త‌గిన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రఘురామ్ రాజన్ ను కోరారు. దీంతో పాటు మిడిల్ లెవ‌ల్ ఉద్యోగాల కల్పన కోసం స్కిల్స్ యూనివ‌ర్సిటీ, ఎటీసీల‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం ఆయ‌న‌కు వివ‌రించారు. స‌రైన ప‌ద్ధతిలో ఏఐని వినియోగిస్తే అంద‌రికి మేలు జ‌రుగుతుంద‌ని ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్నర్ వ్యాఖ్యానించారు. త‌మిళ‌నాడు త‌ర‌హాలో పారిశ్రామిక విధానం ఉంటే మ‌రిన్ని పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌వ‌చ్చున‌ని ఆయ‌న సూచించారు. డేటా సెంట‌ర్ల కోసం పెద్ద ఎత్తున విద్యుత్, నీటి ఉప‌యోగం ఉంటుంద‌ని రఘురామ్ రాజన్ అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు నాలుగు నెల‌ల్లో హైద‌రాబాద్ ప‌ర్యట‌న‌కు వ‌స్తాన‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క మాట్లాడుతు రాష్ట్రంలో ప‌రిశ్రమ‌ల కోసం కావాల్సిన అన్ని సౌక‌ర్యాలు ఉన్నాయ‌ని స్పష్టం చేశారు. కావాల్సిన భూమితో పాటు మౌలిక స‌దుపాయాలు ఉన్నాయ‌ని వివ‌రించారు. భ‌విష్యత్తు అవ‌స‌రాల‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామ‌న్నారు. అంత‌ర్జాతీయ విమానాశ్రయం, అవుట‌ర్ రింగ్ రోడ్డుతో పాటు అనేక స‌దుపాయాలు సిద్ధంగా ఉన్నాయ‌ని తెలిపారు. రీజ‌న‌ల్ రింగ్ రోడ్డుల ఏర్పాటుతో పాటు రేడియ‌ల్ రోడ్లు, ప‌రిశ్రమ‌ల కోసం ప్రత్యేక క్లస్టర్లు తీసుకురాబోతున్నామ‌ని ఉప ముఖ్యమంత్రి వివ‌రించారు. శాంతిభ‌ద్రత‌లను ప‌టిష్టంగా నిర్వహిస్తున్నామ‌ని భ‌ట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభ‌జించి అభివృద్ధి పైన దృష్టి సారించిన‌ట్లు తెలిపారు. క్యూర్, ప్యూర్, రేర్ మోడ‌ల్‌లో ముందుకు వెళ్తున్నట్లు ఆయ‌న వివ‌రించారు.

యువ‌త‌లో నైపుణ్యాల పెంపు కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీని ఏర్పాటు చేశామ‌న్నారు. ఐటీఐలను ఏటీసీలుగా మార్చి విద్యార్థుల‌కు నైపుణ్యాలు నేర్పుతున్నట్లు భ‌ట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 24 గంట‌లు క‌ష్టపడుతున్నార‌న్నారు. తెలంగాణ పారిశ్రామికాభివృద్ధి కోసం త‌గిన స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వాల‌ని ఆయ‌న ర‌ఘ‌రామ‌రాజ‌న్‌ను కోరారు. సుల‌భ‌త‌ర వ్యాపారానికి అనుగుణంగా తెలంగాణలో ప‌రిస్థితులు ఉన్నాయ‌ని ఈ సంద‌ర్భంగా ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు తెలిపారు. ఫార్మా, ఐటీ, డేటా సెంట‌ర్ల కోసం కావాల్సిన మంచి వాతావ‌ర‌ణం, వ‌స‌తులు క‌ల్పిస్తున్నట్లు ఆయ‌న రఘురామ్ రాజన్‌కు వివ‌రించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us