JEE Main 2026 Registration: జేఈఈ మెయిన్‌ సెషన్ 2 దరఖాస్తుకు మరో ఛాన్స్.. మళ్లీ తెరచుకున్న అప్లికేషన్ లింక్! మరికొన్ని గంటలే అవకాశం..

జేఈఈ మెయిన్‌ సెషన్ 2కు దరఖాస్తు చేసుకునేందుకు నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) మరో అవకాశం ఇచ్చింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఫిబ్రవరి 26 (గురువారం) రాత్రి 11.50 గంటలకు దరఖాస్తు గడువు ముగిసింది. అయితే విద్యార్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విండోను మరోమారు..

JEE Main 2026 Registration: జేఈఈ మెయిన్‌ సెషన్ 2 దరఖాస్తుకు మరో ఛాన్స్.. మళ్లీ తెరచుకున్న అప్లికేషన్ లింక్! మరికొన్ని గంటలే అవకాశం..
Jee Main Session 2 Registration Window Re Open

Updated on: Mar 13, 2026 | 7:26 AM

హైదరాబాద్‌, మార్చి 13: విద్యార్ధులకు ఎన్టీయే శుభవార్త చెప్పింది. జేఈఈ మెయిన్‌ సెషన్ 2కు దరఖాస్తు చేసుకునేందుకు నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) మరో అవకాశం ఇచ్చింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఫిబ్రవరి 26 (గురువారం) రాత్రి 11.50 గంటలకు దరఖాస్తు గడువు ముగిసింది. అయితే విద్యార్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ విండోను మరోమారు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మార్చి 12 (గురువారం) మధ్యాహ్నం నుంచి జేఈఈ మెయిన్ సెషన్‌ 2 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మరోమారు ప్రారంభమైంది. శుక్రవారం (మార్చి 13) రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మార్చి 13, 2026 రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు రుసుమును చెల్లించవచ్చు. అయితే ఇప్పటికే సమర్పించిన దరఖాస్తుల్లో మార్పు చేసుకొనే అవకాశం లేదని స్పష్టం చేసింది. దరఖాస్తు చేసుకోని విద్యార్ధులు ఈ రోజు రాత్రి గడువు సమయం ముగిసేలోగా దరఖాస్తు చేసుకోవాలని ఎన్టీయే సూచించింది. రిజిస్ట్రేషన్ల గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్ధులకు అవకాశం ఉండబోదని పేర్కొంది. ఏవైనా సందేహాలుంటే NTA హెల్ప్‌డెస్క్ నంబర్ 011-40759000 లేదా jeemain@nta.ac.in ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు.

జేఈఈ మెయిన్‌ 2026 సెషన్ 2 దరఖాస్తుకు ఇక్కడ క్లిక్ చేయండి.

2024 లేదా 2025లో ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణులైన వారు లేదా 2026లో పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్షకు ఎటువంటి వయోపరిమితి లేదు. కాగా జేఈఈ మెయిన్స్‌ సెషన్‌ 2 ఆన్‌లైన్‌ పరీక్షలు ఏప్రిల్‌ 2 నుంచి 9 వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరుగనున్నాయి. రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌ 1కు దేశ వ్యాప్తంగా మొత్తం 13.5 లక్షల మంది హాజరయ్యారు. ఇక సెషన్‌ 2కు కూడా ఇదే స్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక పరీక్షకు 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను, 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులను ఎన్టీయే విడుదల చేస్తుంది.

ఇవి కూడా చదవండి

జేఈఈ మెయిన్‌ రెండు సెషన్లలో తొలి 2.50 లక్షల మంది ర్యాంకర్లకు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అవకాశం ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 23 నుంచి మే 2వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 పరీక్ష మే 17వ తేదీన నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం 2 పేపర్లకు ఉంటుంది. పేపర్‌ 1 పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, పేపర్‌ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2026 పరీక్షలో ఉత్తీర్ణత పొందిన వారికి ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ 2026 (ఏఏటీ 2026) పరీక్ష ఉంటుంది. ఏఏటీ-2026 జూన్‌ 4వ తేదీ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. ఏఏటీ ఫలితాలు జూన్‌ 7, 2026వ తేదీన వెల్లడిస్తారు. జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియ జూన్‌ 2 నుంచి ప్రారంభమవుతుంది.

జేఈఈ మెయిన్‌ 2026 సెషన్ 2 దరఖాస్తుకు ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us