
హైదరాబాద్, మే 18: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్ సీట్ల భర్తీకి ఆదివారం (మే 17) జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షలో పేపర్ 1, 2 ప్రశ్నాపత్రాలు మధ్యాస్తంగా వచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఫిజిక్స్ ప్రశ్నలు కఠినంగా ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులుపడ్డారు. మ్యాథమెటిక్స్ మాత్రం మద్యస్థంగా వచ్చింది. కెమిస్ట్రీ కాస్త సులువుగా వచ్చినట్లు విద్యార్ధులు చెబుతున్నారు. ఉదయం నిర్వహించిన పేపర్ 1తోపాటు మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ 2లోనూ ఫిజిక్స్ విభాగం నుంచి వచ్చిన ప్రశ్నలకు కాస్త సమయం ఎక్కువ తీసుకోవడంతో విద్యార్థులు టెన్షన్‌పడ్డారు. అటు మ్యాథమెటిక్స్ ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నప్పటికీ సుదీర్ఘంగా ఉన్నాయని, కెమిస్ట్రీ మాత్రం కాస్త సులభంగా ఉన్నట్టు విద్యార్థులు తెలిపారు.
అడాన్స్‌డ్ పరీక్షలో రెండు పేపర్లుండగా ఒక్కో పేపర్ 180 మార్కులకు నిర్వహించారు. ఒక్కో సబ్జెక్టుకు గత ఏడాది18 ప్రశ్నలు అడిగారు. కానీ ఈసారి ఒక్కో సెక్షన్‌లో 16 చొప్పున మొత్తం 98 ప్రశ్నలు అడిగారు. పేపర్ 1లో సెక్షన్ ఏ, సెక్షన్ సీ ఎక్కువ స్కోర్‌విగా ఉన్నాయని, సెక్షన్-బీ, సెక్షన్-డీలో ఇచ్చిన ప్రశ్నలు మాత్రం కాస్త కఠినంగా, సమయం ఎక్కువ తీసుకునేవిగా ఉన్నట్టు నిపుణులు విశ్లేషించారు. దీంతో బీ, డీ సెక్షన్‌లలో ఇచ్చిన ప్రశ్నలే ర్యాంక్‌లను నిర్ధారించేవిగా ఉన్నాయి. పేపర్ 2లో మంచి స్కోర్ చేసినవారు టాప్‌ర్యాంక్‌లు సాధించే అవకాశం ఉంది. తాజాగా నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్షకు సంబంధించిన రెస్పాన్స్ సీట్లు మే 21న వెల్లడిస్తారు. ఇక మే 25న ప్రాథమిక కీ విడుదల చేసి, జూన్ 1న ఫలితాలు విడుదల చేస్తారు.
ఇక కటాఫ్ విషయానికొస్తే గత ఏడాది 90 శాతానికిపైగా మార్కులు సాధించిన వారికి ఆల్ ఇండియా టాప్ 10లోపు ర్యాంకులు వచ్చాయి. ఈ సంవత్సరం కూడా కటాఫ్ దాదాపు అదే విధంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓపెన్ కేటగిరి కట్ ఆఫ్ మార్క్ సుమారుగా 20 నుంచి 25 శాతంలోపే ఉండే అవకాశం ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.