Inter Syllabus: ఇంటర్మీడియట్ సిలబస్‌ మారబోతుందా?.. క్లారిటీ ఇచ్చిన బోర్డు

ఇంటర్మీడియట్ బోర్డు కొత్త సిలబస్‌ ప్రతిపాదనలను సర్కార్‌ తిరస్కరించింది. బోర్డు ప్రతిపాదించిన సవరణపై వివరణాత్మక అధ్యయనం నిర్వహించాలని ప్రభుత్వం బోర్డును కోరింది. అదేవిధంగా ఆర్ట్స్, కామర్స్ విభాగాలకు ఇంటర్నల్‌లకు 20 మార్కులు, థియరీకి 80 మార్కులను ప్రవేశపెట్టడం ద్వారా పరీక్షా సరళిని మార్చాలనే బోర్డు ప్రతిపాదనను సైతం ప్రభుత్వం తిప్పి పంపింది..

Inter Syllabus: ఇంటర్మీడియట్ సిలబస్‌ మారబోతుందా?.. క్లారిటీ ఇచ్చిన బోర్డు
No Changes In Inter Syllabus

Updated on: Apr 28, 2025 | 4:39 PM

హైదరాబాద్‌, ఏప్రిల్ 28: తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ సిలబస్‌ మార్పుకు బ్రేక్‌ పడింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి సిలబస్‌ మార్పుతోపాటు ఇంటర్నల్‌ మార్కుల విధానం తీసుకురానున్నట్లు ఇంటర్‌ బోర్డు గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రతిపాదనలను ఇంటర్‌ బోర్డు విద్యాశాఖకు పంపింది. అయితే ఇంటర్ బోర్డు ప్రతిపాదనలకు విద్యాశాఖ ఆమోదం లభించలేదు. ఆర్ట్స్‌ గ్రూపు సబ్జెక్టులతోపాటు భాషా సబ్జెక్టుల్లోనూ ఇంటర్నల్‌ మార్కులు ప్రవేశపెట్టాలని, 20 మార్కులకు ప్రాజెక్టులు లేదా ఎసైన్‌మెంట్‌ వాటి పేరిట ఇంటర్నల్‌ మార్కులు కేటాయించాలని ప్రతిపాదనల్లో తెలిపింది. అలాగే 80 మార్కులకు మాత్రమే రాత పరీక్ష జరపాలన్నది బోర్డు ప్రతిపాదన. సైన్స్‌ సబ్జెక్టుల్లో ఎన్‌సీఈఆర్‌టీకి అనుగుణంగా సిలబస్‌ తగ్గించి, కొన్ని చిన్న చిన్న మార్పులు చేయాలని బోర్డు భావించింది. సిలబస్‌ మార్పుకు విద్యాశాఖ నో చెప్పడంతో ఆ ప్రయత్నాలన్నీ ఆవిరయ్యాయి.

నిజానికి, ఇంటర్‌ సిలబస్‌ మార్పుకు సంబంధించి 2024 నవంబరు నుంచి కసరత్తు జరుగుతోంది. పలువురు అధ్యాపకులు, ప్రొఫెసర్లతో చర్చించి సిలబస్‌ మార్పుకు పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌తో పోల్చుకుంటే తెలంగాణ ఇంటర్‌ సిలబస్‌ అధికంగా ఉందని సబ్జెక్టు నిపుణులు అభిప్రాయపడ్డారు. రసాయనశాస్త్రంలో ఆరు అధ్యాయాలను తొలగించాలని, అలాగే గణితం, భౌతికశాస్త్రంలో 15 నుంచి 20 శాతం సిలబస్‌ తగ్గించాలని బోర్డు భావించింది. భౌతికశాస్త్రంలో కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ లాంటి అంశాలపై అవగాహన కల్పించేలా సిలబస్‌లో మార్పు చేయాలని కూడా భావించారు. సైన్స్‌తోపాటు ఇతర గ్రూపుల్లోనూ సిలబస్‌ మార్పులపై ప్రతిపాదనలను తయారు చేసిన ఇంటర్‌ బోర్డు.. ఏప్రిల్ రెండో వారంలో ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. పది రోజుల అనంతరం వాటిని తిరస్కరిస్తున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. దీంతో 2025-26 విద్యా సంవత్సరానికి పాత సిలబస్‌తోనే యథాతథంగా ఇంటర్ విద్య అమలు చేయనున్నారు.

ఆలస్యమే కారణమా?

రాష్ట్రంలో జూన్‌ 1 నుంచే విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. అప్పటికి సిలబస్‌ మార్పు, తెలుగు అకాడమీ పుస్తకాల ముద్రణకు సమయం సరిపోదు. జూన్‌ మొదటి వారానికి విద్యార్ధులకు పాఠ్య పుస్తకాలు అందించగలరా అన్న ప్రశ్న తలెత్తడంతో ప్రభుత్వం బోర్డు ప్రతిపాదనలను తిరస్కరించింది. ఆ ప్రశ్నకు ఇంటర్‌బోర్డు అధికారులు సమాధానం చెప్పలేకపోవడం కొసమెరుపు. అందువల్లనే ప్రభుత్వం పాత సిలబస్‌నే కొత్త విద్యా సంవత్సరంలోనూ కొనసాగించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. పదో తరగతిలో ఇంటర్నల్ మార్కులు తొలగించి, ఇంటర్‌లో ప్రవేశ పెట్టడంపై కూడా సర్కార్‌ కొంత యోచన చేసి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.