ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్య భయాలు నెలకొన్నాయి. ఈ ఏడాది ఆర్థిక మాంద్యం ప్రభావం తప్పదని వార్తలు వస్తోన్న క్రమంలో కంపెనీలుఉ భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలను నిర్ధాక్షణ్యంగా ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. గూగుల్ మొదలు మైక్రోసాఫ్ట్ వరకు అన్ని సంస్థలు ఆర్థిక భారాన్ని తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో దిగ్గజ ఐటీ సంస్థ ఇంటెల్ కీలక నిర్ణయం తీసుకుంది.
అన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న క్రమంలో ఇంటెల్ మాత్రం వినూత్నంగా ఆలోచించింది. ఉద్యోగులను తొలగించకుండా వారి జీతాల్లో కోత విధించాలని నిర్ణయించింది. కంపెనీ సీఈవో స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగుల వరకు జీతాల్లో కోత పెట్టేందుకు సిద్ధమవుతోంది. సంస్థ సీఈవో పాట్ గెల్‌సింగర్ వేతనంలో 25 శాతం, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులకు 15 శాతం, సీనియర్ మేనేజర్లకు 10 శాతం, మధ్యస్థాయి మేనేజర్లకు 5 శాతం కోత విధించనున్నారు.. కంపెనీపై పెరిగిపోతున్న ఆర్థిక పరమైన భారాన్ని తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంటెల్ తెలిపింది.
ఈ నిర్ణయం సంస్థ ఆర్థిక నష్టాలను తగ్గిస్తుందని ఇంటెల్ అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే ఇంటెల్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మార్కెట్ వర్గాలు ఆహ్వానిస్తున్నాయి. ప్రస్తుత తరుణంలో ఇతర కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో ఇంటెల్ ఇలా భిన్నంగా వ్యవహరించడం మంచి విషయమని అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..