AP TET 2025 Exam: చదువు కోవాలా? చదువు చెప్పాలా? టెట్‌ అర్హతపై సర్కార్‌ బడి టీచర్ల మల్లగుల్లాలు

TET qualification for govt School Teacher: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడుల్లోని ఉపాధ్యాయులకు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2025) గుది బండలా మారింది. 2011కి ముందు డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు సర్వీస్‌లో కొనసాగాలంటే టెట్‌ ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్‌ 1వ తేదీన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వీరంతా రెండేళ్లలోపు..

AP TET 2025 Exam: చదువు కోవాలా? చదువు చెప్పాలా? టెట్‌ అర్హతపై సర్కార్‌ బడి టీచర్ల మల్లగుల్లాలు
TET Mandatory for govt School Teachers
Image Credit source: AI Image

Updated on: Nov 04, 2025 | 10:51 AM

అమరావతి, నవంబర్‌ 4: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడుల్లోని ఉపాధ్యాయులకు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2025) గుది బండలా మారింది. 2011కి ముందు డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు సర్వీస్‌లో కొనసాగాలంటే టెట్‌ ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్‌ 1వ తేదీన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వీరంతా రెండేళ్లలోపు టెట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని గడువు ఇచ్చింది. అయితే ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారికి మాత్రం టెట్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. వీనే పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్‌ ఉత్తీర్ణులు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ నిబంధనలు ఉపాధ్యాయులను కలవరపెడుతున్నాయి.

రాష్ట్రంలోని ప్రస్తుతం విధుల్లో ఉన్న 1.8 లక్షల మంది టీచర్లు ఉన్నారు. వీరంతా రెండేళ్లలో టెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. వీరిలో పీఈటీ, పీడీలకు టెట్‌ అవసరం లేదు. వీరిని మినహాయించే దాదాపు లక్షన్నర మంది టీచర్లు టెట్ పరీక్షలో అర్హత సాధించవల్సి ఉంటుంది. విద్యాహక్కు చట్టం 2010 ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల నియామకాలకు టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. 2010 తర్వాత ఉపాధ్యాయ పోస్టులలో చేరిన వారంతా టెట్‌ ఉత్తీర్ణత సాధించి చేరిన వారే కావడం విశేషం. 2010 కంటే ముందు కేవలం డీఎస్సీ పరీక్షను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఇందులో ప్రతిభ కనబరచిన వారికి ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 2027 ఆగస్టు 31వ తేదీలోపు వీరంతా టెట్‌ ఉత్తీర్ణులు కావాల్సి ఉంది.

సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఒకవేళ రెండేళ్లలో వీరంతా టెట్‌ ఉత్తీర్ణత సాధించలేకుంటే ఉద్యోగం వదులుకోవల్సి ఉంటుందని తీర్పు సందర్భంగా సుప్రీం స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బడుల్లోని ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చట్టాన్ని పరిగణలోకి తీసుకొని ఇన్‌ సర్వీస్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ టెట్‌ ఉత్తీర్ణత సాధించాలని చెప్పడం సరికాదని, రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకొని ఎన్‌సీటీఈ మార్గదర్శకాలలో సవరణ చేసే విధంగా రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేస్తున్నారు. టెట్‌ పరీక్ష ఉపాధ్యాయులకు గుడిబండగా మారిందని, పాతికేళ్లకు పైగా ఉద్యోగం చేస్తున్న ఉపాధ్యాయులు ఇప్పుడు చదివి రాయాలంటే విద్యార్థుల భవిష్యత్‌ ఏమౌతుందో కనీసం పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఇటు టెట్‌ పరీక్షకు చదవాలా? విద్యార్ధులకు చదువు చెప్పాలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కూటమి సర్కార్ టెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్‌ 23వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. దీంతో ఇన్‌ సర్వీస్‌ టీచర్లంతా టెట్ రాయాలా? వద్దా? అంటూ మల్లగుల్లాలు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ వేసి మినహాయింపు ఇస్తుందేమోనని ఆశతో ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.