రూ.32 లక్షల జాబ్ ఆఫర్‌కు గుడ్‌బై.. పెద్ద జీతం కాదు నచ్చిన జీవితమే ముఖ్యమంటున్న IIT గ్రాడ్యుయేట్

ఏడాదికి రూ.32 లక్షల వేతనంతో వచ్చే ఉద్యోగ ఆఫర్‌ను వదులు కోవడం ఎవరికైనా కష్టమైన నిర్ణయమే. కానీ ఐఐటీ రూర్కీ గ్రాడ్యుయేట్‌ అయిన డేటా సైంటిస్ట్ స్నేహా ప్రియ మాత్రం భారీ జీతం కంటే మానసిక ప్రశాంతతే తనకు ముఖ్యమని క్షణం కూడా ఆలోచించకుండా జాబ్‌ను వదిలేసింది. గురుగ్రామ్‌లో కొత్త ఉద్యోగంలో చేరాల్సి ఉన్నప్పటికీ తాను బెంగళూరులోనే ఉండాలని నిర్ణయించుకుంది. అందుకు గల కారణాలను వెల్లడిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సుదీర్ఘ పోస్టు పెట్టింది. ఇక ఈ పోస్టు చదివిన నెటిజన్లు ఒక్క క్షణం నోరెళ్లబెట్టి అవాక్‌ అవుతున్నారు. స్నేహా ప్రియ కథేంటో.. ఆమె పోస్టులో ఏం రాసిందో మనమూ తెలుసుకుందాం..

రూ.32 లక్షల జాబ్ ఆఫర్‌కు గుడ్‌బై.. పెద్ద జీతం కాదు నచ్చిన జీవితమే ముఖ్యమంటున్న IIT గ్రాడ్యుయేట్
IITian turns down Gurgaon job to stay in Bengaluru

Updated on: Jul 03, 2026 | 5:13 PM

బెంగళూరు నగరంలోని ఆప్యాయత, భద్రతాభావం, ఇంటి వాతావరణం తనకు ఎంతో ఇష్టమట. కాదు.. కాదు ముఖ్యమని పేర్కొంది. తాను ఈ రోజు గురుగ్రామ్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించి, బెంగళూరుకు వీడ్కోలు చెప్పాల్సి ఉందని కానీ ఆ పని చేయడం లేదని తన ఇన్‌స్టా పోస్టులో చెప్పుకొచ్చింది. ‘నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను.. నా సందేహాలన్నింటికీ బెంగళూరు జంట ఇంద్రధనుస్సు సమాధానం చెప్పింది’ అని ఆమె రాసింది. ఈ పోస్టుతో పాటు నగర ఆకాశంలో కనిపించిన రెండు ఇంద్రధనుస్సుల వీడియోను కూడా అందులో పంచుకుంది. తన నిర్ణయాన్ని ఆమె ఒక వాక్యంలో ఇలా వివరించింది.. కొన్నిసార్లు అత్యధిక జీతం ఇచ్చే ఉద్యోగమే ఉత్తమ కెరీర్ నిర్ణయించదు. నేను ప్రశాంతతను ఎంచుకున్నాను.. అని తన పోస్టులో తెలిపింది.

మారుతున్న యువత ట్రెండ్

తన నిర్ణయంలో భద్రతా అంశం ప్రధాన పాత్ర పోషించిందట. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతానికి పలు సందర్భాల్లో వెళ్లినప్పుడు ఎదురైన కొన్ని అసౌకర్యకర అనుభవాలు అక్కడికి మారేందుకు తనను వెనుకంజ వేయించాయని ఆమె పేర్కొంది. అదే సమయంలో బెంగళూరులో తనకు ఎదురైన ఆప్యాయత, స్నేహపూర్వక వాతావరణాన్ని ఆమె ప్రశంసించింది. ఐఐటీ రూర్కీలో చదువుతున్న సమయంలో ఢిల్లీకి చేసిన పలు ప్రయాణాల్లో పొందిన అనుభవాలతో పోలిస్తే, బెంగళూరు తనకు మరింత సౌకర్యంగా, సురక్షితంగా అనిపించిందని చెప్పింది.

ఇవి కూడా చదవండి

స్నేహా చేసిన ఈ ఇన్‌స్టా పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేనా నెటిజన్లు దీనిపై చర్చోపచర్చలు చేస్తున్నారు. లెక్కకు మించి కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను చెబుతున్నారు. సాధారణంగా ఎక్కువ వేతనం ఉద్యోగ ఎంపికలో ప్రధాణంగా భావించినప్పటికీ, వ్యక్తిగత భద్రత, మానసిక ఆరోగ్యం, జీవన నాణ్యత వంటి అంశాలు కూడా అంతే ముఖ్యమని అనేక మంది కామెంట్ సెక్షన్‌లలో అభిప్రాయపడ్డారు. నిజానికి స్నేహా ప్రియ ఒక్కరే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. ప్రస్తుత కాలంలో యువతలో మారుతున్న కెరీర్ ప్రాధాన్యాలను స్నేహ ప్రియ కథ ప్రతిబింబిస్తోంది. ఆమెకు పెద్ద జీతాన్ని వదులుకోవడం రాజీ కాదు.. తనకు కావాల్సిన జీవన విధానాన్ని ఎంచుకోవడమే అసలైన ఎంపిక. ఎక్కువ వేతనం కంటే మనసుకు నచ్చిన జీవితం, ప్రశాంతత ముఖ్యమని ఆమె నిర్ణయం మరోసారి గుర్తు చేస్తోంది. ఇంతకీ మీరేం అంటారు.. స్నేహ ప్రియ స్థానంలో మీరుంటే ఎలాంటి నిర్ణయం తీసుకుంటారె కామెంట్లలో చెప్పండి.

Follow Us