IT Jobs In Hyderabad: గతేడాది కరోనా మహమ్మారి యావత్ మానవ సమాజాన్ని అతాలకుతలం చేసింది. దాదాపు అన్ని రంగాలపై వైరస్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. దేశ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక పాత ఉద్యోగాలే పోతుంటే కొత్త జాబ్‌ల ఊసే లేకుండా పోయింది. దీంతో 2020లో ఉద్యోగాల నియామకాలపై తీవ్ర ప్రభావం పడింది.
ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం, కరోనా తీవ్రత తగ్గుతుండడంతో మళ్లీ ఆర్థిక రంగం ఊపందుకుంటోంది. ఈ క్రమంలోనే ఉద్యోగ నియమకాలు కూడా మళ్లీ మొదలయ్యాయి. ఇక దీనికి తోడు డిటిటలైజేషన్, ఆటోమేషన్ కారణంగా ఐటీ రంగంలోనూ ఉద్యోగ నియామకాలు పెరుగుతున్నాయి. జనవరి నెలతో పోలిస్తే ఫిబ్రవరిలో రికార్డ్ స్థాయిలో మంచి వృద్ది నమోదైంది. అన్ని పరిశ్రమల్లో కలిపి జనవరిలో 1925 ఉద్యోగాలు భర్తీకాగా.. ఫిబ్రవరిలో ఏకంగా 2,356 నియామకాలు జరిగాయి. ఈ విషయాలు నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ సర్వేలో తేలాయి. కొవిడ్–19 తర్వాత తొలిసారి ఉద్యోగ నియమకాలు పెరగడం సానుకూల అంశమని నివేదికలో వెల్లడించారు. ఇక నగరాల వారీగా చూస్తే.. గత నెలలో 31 శాతం జాబ్ రిక్రూట్‌మెంట్స్‌తో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండగా.. 28 శాతంతో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ఇక తర్వాతో స్థానాల్లో 24 శాతంతో పుణె, 20 శాతంతో వడోదర మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఏది ఏమైనా మళ్లీ ఉద్యోగాల నియమకాలు పెరుగుతుండడం ఆశజనకంగా కనిపిస్తోంది.