AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్‌ పేపర్‌.. ఈ పరీక్ష ఎలా ఉంటుందో తెలుసా?

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) నిర్వహణ సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ ఈ సారి గేట్‌ 2027 పరీక్ష విధానంలో కీలక మార్పులు తీసుకువచ్చింది. గేట్‌ 2027లో కొత్తగా రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌ (RA) పేపర్‌ చేరింది. రోబోటిక్స్, ఆటోమేషన్, మెకాట్రానిక్స్, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రీ 4.0 రంగాలలో నైపుణ్యం కలిగిన నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ పేపర్‌ను ప్రవేశ పెట్టింది. ఈ చేర్పుతో గేట్ పేపర్ల సంక్‌య 29 నుంచి 30కి పెరిగింది..

ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్‌ పేపర్‌.. ఈ పరీక్ష ఎలా ఉంటుందో తెలుసా?
GATE Introduces Robotics Automation as New Subject
Srilakshmi C
|

Updated on: Jul 24, 2026 | 8:53 AM

Share

హైదరాబాద్‌, జులై 24: ప్రస్తుతం గేట్ పరీక్షలో ఒక పేపర్‌గా ఉన్న టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఫైబర్‌ సైన్స్‌ను ఇంజినీరింగ్‌ సైన్సెస్‌లో ఒక సెక్షనల్‌ పేపర్‌గా మార్చారు. అంటే కొత్తగా రోబోటిక్స్‌ పేపర్‌ను అదనంగా చేసినా.. మొత్తం పేపర్ల సంఖ్య గతేడాది మాదిరిగానే 30గా ఉంటుంది. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు ఐఐటీ మద్రాస్‌ చేపట్టగా.. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఐదేళ్ల తర్వాత అన్ని పేపర్లలో సిలబస్‌ను సవరించినట్లు పేర్కొంది. రోబోటిక్స్, ఆటోమేషన్ సంబంధిత రంగాలలో ఎం.టెక్ ప్రోగ్రామ్‌లు లేదా పీఎస్‌యు రిక్రూట్‌మెంట్ చేయాలనుకునే అభ్యర్థులు ఇప్పుడు గేట్ 2027లో ప్రత్యేక RA పేపర్‌ను ఎంచుకోవచ్చు. కొత్తగా ప్రవేశపెట్టిన రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ (RA) పేపర్‌ను, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఆటోమేషన్ టెక్నాలజీలను మిళితం చేసి బహుళ విషయాలపై అభ్యర్థులను పరీక్షించడానికి ప్రత్యేకంగా రూపొందించారు. ఈ పేపర్‌లో 85 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. మిగిలిన 15 మార్కులు జనరల్ ఆప్టిట్యూడ్‌కు కేటాయిస్తారు. మొత్తం 100 మార్కులకు ఇతర గేట్ (GATE) పేపర్ల మాదిరిగానే ఉంటుంది. పేపర్ కోడ్ RA. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానం ద్వారా 3 గంటల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తుంది.

గేట్‌ 2027 కొత్తగా చేర్చిన రోబోటిక్స్‌ పేపర్‌ సిలబస్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

గేట్ 2027 రోబోటిక్స్ అండ్‌ ఆటోమేషన్ సిలబస్ ఏమిటి?

రోబోటిక్స్ అండ్‌ ఆటోమేషన్ పేపర్‌ రెండు ప్రత్యేక విభాగాలుగా విభజించారు. పార్ట్ ఎ (సాధారణ విభాగం)లో ఇంజనీరింగ్ గణితం, పార్ట్ బిలో ఒక స్పెషలైజేషనను ఎంచుకోవాలి. ఇందులో పార్ట్ బి1లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, పార్ట్ బి2లో మెకానికల్ ఇంజనీరింగ్ ఆప్షన్లు ఉంటాయి. వీటిలో ఒకటి ఎంచుకోవాలి. కొత్తగా గేట్‌ 2027 పరీక్షలో రోబోటిక్స్ అండ్‌ ఆటోమేషన్ పేపర్‌ను ఎందుకు ప్రవేశ పెట్టారంటే.. ప్రస్తుతం పరిశ్రమలన్నింటిలో ఆటోమేషన్ టెక్నాలజీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, స్మార్ట్ ఫ్యాక్టరీలు, అటానమస్ సిస్టమ్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ పేపర్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌లకు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగాలలో ఉన్నత విద్య, నియామకాల కోసం ఒక ప్రత్యేక పరీక్షా కోర్సును అందిస్తుంది. మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, మెకాట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్‌ ఆటోమేషన్ ఇంజనీరింగ్ వంటి విభాగాలకు చెందిన, రోబోటిక్స్ సంబంధిత రంగాలలో ప్రత్యేకత సాధించాలనుకునే విద్యార్థులకు కూడా ఇది సహాయపడుతుందని భావిస్తున్నారు.

కాగా ఈ ఏడాది గేట్ 2027 పరీక్ష సిలబస్‌లో కూడా మార్పులు చేసింది. ఈ కొత్త సిలబస్‌తోపాటు కొత్తగా చేర్చిన రోబోటిక్స్ అండ్‌ ఆటోమేషన్‌ సిలబస్‌ను కూడా అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక గేట్‌ 2027 రాత పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. ఆగస్ట్ 2026 నెల మధ్యలో ప్రారంభమవుతుంది. బీటెక్‌తోపాటు బీఎస్సీ, బీఏ, బీకాం విద్యార్థులు ఈ పరీక్ష రాయొచ్చు. గేట్‌ పరీక్షలో సాధించిన స్కోర్‌కు మూడేళ్ల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. దానితో ఎంటెక్‌లో చేరితే AICTE నుంచి కోర్సు పూర్తయ్యే రెండేళ్లపాటు ప్రతి నెలా రూ.12,400 చొప్పున స్టైపెండ్‌ అందిస్తారు. అలాగే గేట్‌ స్కోర్ ఆధారంగా కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు నేరుగా ఉద్యోగాలు కూడా కల్పిస్తాయి.

గేట్‌ 2027 కొత్త సిలబస్, పరీక్షల షెడ్యూల్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us