
హైదరాబాద్, జనవరి 14: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఎన్‌ఐటీ, పీఎస్‌యూల్లో ఎమ్‌టెక్ (పోస్ట్ గ్రాడ్యుయేట్), పీహెచ్‌డీ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2026) రాత పరీక్ష వచ్చే నెలలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గేట్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ మేరకు ఐఐటీ గువాహటి అధికారిక వెబ్‌సైట్‌లో వీటిని అందుబాటులో ఉంచింది. గేట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఎన్‌రోల్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదు చేసి అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కాగా షెడ్యూల్ ప్రకారం గేట్ 2026 ఆన్‌లైన్ రాత పరీక్షలు దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో పలు పరీక్ష కేంద్రాల్లో జరుగనున్నాయి. మొత్తం 30 టెస్ట్ పేపర్లకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలు రోజుకు రెండు సెషన్లలో జరుగుతాయి. ఈ పరీక్షలు ఆయా తేదీల్లో మొదటి సెషన్ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, రెండో సెషన్ పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు జరగనున్నాయి. ఇక మార్చి 19న గేట్ ఫలితాలు విడుదల కానున్నాయి.
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు తమ పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోటో, సంతకం వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోవల్సి ఉంటుంది. వీటిల్లో ఏది స్పష్టంగా లేకపోయినా, ఏవైనా వివరాలు తప్పుగా వచ్చినా వెంటనే ఐఐటీ గువాహటి అధికారులను సంప్రదించి ఆ వివరాలు సరిచేసుకోవల్సి ఉంటుంది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌తో పాటు ఏదైనా ఒక చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డును తప్పనిసరిగా తమ వెంట పరీక్షా కేంద్రంకి తీసుకువెళ్లాలి. అలాగే గేట్ అడ్మిట్ కార్డులో సూచించిన విధంగా అన్ని మార్గదర్శకాలను అనుసరించవల్సి ఉంటుంది.
గేట్ 2026 అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.