ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది. ఆర్థిక మాంద్యం ఈ ఏడాది ప్రపంచాన్ని అతలాకుతలం చేయనుందన్న వార్తల నేపథ్యంలో కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ప్రపంచ దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఉద్యోగుల తొలగింపు అంతర్జాతీయ సంస్థలకే పరిమితం కాలేదు, దేశీయంగా కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి కంపెనీలు. భారత్‌కు చెందిన ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజుస్ ఉద్యోగులకు షాకిచ్చింది.
ఇదిలా ఉంటే గతంలోనే 2500 మందిని తొలగించిన ఈ యూనికార్న్ సంస్థ.. తాజాగా మరో 1000 మందిని తొలగించిందని తెలుస్తోంది. డిజైన్, ఇంజినీరింగ్, ప్రొడక్షన్ విభాగాలకు చెందిన ఉద్యోగులను ఇంటికి పంపించినట్లు సమాచారం. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో ఉద్యోగులను తొలగించే సమయంలో భవిష్యత్తులో ఉద్యోగుల తొలగింపు ఉండవని ఉద్యోగులకు హామి ఇచ్చారు. అయితే కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే మరో 1000 మందిని తొలగించడం గమనార్హం.
ఇక బైజూస్ ముఖ్యంగా ఆపరేషన్స్, లాజిస్టిక్స్, కస్టమర్ కేర్, ఇంజినీరింగ్, సేల్స్, మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ వంటి విభాగాలను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించే ఆలోచనలో ఉందని సమాచారం. ఇదిలా ఉంటే ఉద్యోగులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే బైజూస్ ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆఫీసులకు వచ్చిన వారికి నేరుగా పింక్ స్లిప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరికొందరికి వాట్సాప్ లేదా నేరుగా కాల్స్ చేసి గూగుల్ మీట్‌లో కనెక్ట్ అవ్వాలని సూచించి తర్వాత ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు సమాచారం అందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక నోటీస్ పీరియడ్ ముగిసన తర్వాత ప్యాకేజీ చెల్లిస్తామని బైజూస్ తెలిపినట్లు సమాచారం.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..