ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉద్యోగులు ఒకే భయంతో బతుకుతున్నారు. ఎప్పుడు ఏ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆర్థిక మాంద్యం భయాలు, ఆదాయాలు తగ్గడం వంటి అంశాలు ఉద్యోగుల తొలగింపునకు కారణంగా మారుతున్నాయి. ఆర్థిక నష్టాలను తప్పించుకోవడం కోసం ఉద్యోగుల తొలగింపునే ఏకైన మార్గంగా కంపెనీలు ఎంచుకోడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు.
ఈ తరుణంలో తాజాగా మరో ఐటీ దిగ్గజ సంస్థ డెల్ ఉద్యోగులను తొలగించింది. కంప్యూటర్‌ల అమ్మకాలు పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6,650 ఉద్యోగాలను తొలగించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటికే ఉద్యోగులను ఈమెయిల్ ద్వారా సమాచారం అందించింది. బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం మొత్తం సిబ్బందిలో 5 శాతం ఉద్యోగులను డెల్ ఉద్వాసన పలుకుతోందని తెలుస్తోంది. ఈ తొలగింపు తర్వాత డెల్ ఉద్యోగుల సంఖ్య కనీసం ఆరేళ్లలో కనిష్ంగా 1,26,300గా ఉంటుందని బ్లూమ్ బెర్గ్ నివేదికలో తెలిపింది.
ఇదిలా ఉంటే ఉద్యోగుల తొలగింపుపై సంస్థ కో-చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ క్లార్క్ మాట్లాడుతూ.. ‘ ప్రస్తుతం కంపెనీ మార్కెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ అనిశ్చితి భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ఉద్యోగులను తొలగించడానికి ఇదే కారణం’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక కరోనా తదనంతర పరిస్థితుల తర్వాత కంప్యూటర్లు ఇతర హార్డ్‌వేర్ ఉత్పత్తుల డిమాండ్ పెరిగి నప్పటికీ 2022 నాల్గవ త్రైమాసికంలో వ్యక్తిగత కంప్యూటర్ షిప్‌మెంట్‌లు బాగా పడిపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..