న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఆ ఘడియ రానేవచ్చింది. సైన్స్ విభాగాల్లో పరిశోధన, బోధనకు అవకాశం కల్పించే ‘జాయింట్ సీఎస్‌ఐఆర్ యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) జూన్-2024 ఫలితాలు మంగళవారం (అక్టోబర్ 15) విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. పరీక్ష రాసిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా జులై 25, 26, 27 తేదీల్లో దేశవ్యాప్తంగా 187 నగరాల్లో ఈ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా దాదాపు 2.25లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. తాజా ఫలితాల్లో 1,963 మంది అభ్యర్ధులు JRFకు అర్హత సాధించారు. జేఆర్‌ఎఫ్ పొందిన వారు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కూడా అర్హత సాధిస్తారు.
3172 మంది అభ్యర్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్, పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హత సాధించారు. 10,969 మంది అభ్యర్థులు పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హత సాధించారు. పీహెచ్‌డీ ప్రవేశాలకు సీఎస్‌ఐఆర్ నెట్ మార్కులకు 70 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూ రౌండ్‌కు 30 శాతం మార్కులు కేటాయిస్తారు.
సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ పరీక్షలో అర్హత సాధిస్తే.. సైన్స్ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీలో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. జేఆర్‌ఎఫ్‌తోపాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, పీహెచ్‌డీ ప్రవేశాలకు వీలుకలుగుతుంది. వీరు సీఎస్‌ఐఆర్ పరిధిలోని రిసెర్చ్ సెంటర్లలో, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది. జేఆర్‌ఎఫ్ అర్హత పొందితే విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానూ ఎంపికకావచ్చు.
సీఎస్‌ఐఆర్- యూజీసీ నెట్ 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.