
అమరావతి, మే 27: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మెగా డీఎస్సీ-2025’ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 15,941 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ రికార్డు సమయంలో, పూర్తి నిబద్ధతతో విజయవంతంగా పూర్తయింది. ఈ నియామకాలన్నింటినీ అత్యంత పారదర్శకంగా, అత్యాధునిక సాంకేతిక ఆధారిత విధానంలో, చట్టబద్ధమైన నిబంధనలకు లోబడి విద్యాశాఖ పూర్తి చేసింది. ఈ నియామక ప్రక్రియ అంతా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు, నోటిఫై చేసిన నియామక నిబంధనలు, రిజర్వేషన్ విధానాలకు అనుగుణంగానే జరిగింది. ప్రతి దశలోనూ పారదర్శకత చర్యలు, డిజిటల్ భద్రతా వ్యవస్థలు, ఫిర్యాదుల పరిష్కార (Grievance Redressal) విధానాలు, జిల్లా స్థాయి ధృవీకరణ (Verification) వ్యవస్థలను పటిష్టంగా అమలు చేయడం జరిగింది.
అయితే కొన్ని వార్తాపత్రికలు, సోషల్ మీడియా వేదికలు, కొందరు వ్యక్తులు కావాలనే మెగా డీఎస్సీ-2025పై నిరాధారమైన, తప్పుదారి పట్టించే ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రభుత్వ నోటిఫైడ్ రిజర్వేషన్ విధానాలను, ముఖ్యంగా హారిజాంటల్ రిజర్వేషన్ (Horizontal Reservation) అమలు తీరును కనీసం అర్థం చేసుకోకుండా… ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగిందని, మెరిట్ జాబితాలు ప్రచురించలేదని, అక్రమ ఎంపికలు జరిగాయంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు గుప్పిస్తున్నారు.
మెగా డీఎస్సీకి సంబంధించిన పూర్తి మెరిట్ జాబితాలు, ఎంపిక జాబితాలు, ఇతర అన్ని వివరాలు నోటిఫై చేసిన విధానం ప్రకారమే పారదర్శకంగా ప్రచురించబడ్డాయి. మొత్తం ఎంపిక ప్రక్రియ అంతా కేవలం మెరిట్, రిజర్వేషన్ రోస్టర్, అనేక స్థాయుల ధృవీకరణ వ్యవస్థల ఆధారంగా, అత్యంత సురక్షితమైన డిజిటల్ విధానంలోనే నిర్వహించబడింది. ఇందులో ఎలాంటి అక్రమాలకు తావులేదు.
ఈ అబద్ధపు ప్రచారాలు అభ్యర్థుల్లో అనవసర ఆందోళనలు రేకెత్తించడమే కాకుండా, విద్యాశాఖ ప్రతిష్టకు, నియామక ప్రక్రియ విశ్వసనీయతకు భంగం కలిగిస్తున్నాయి. దీనిని తీవ్రంగా పరిగణించిన పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే తగిన న్యాయపరమైన చర్యలను ప్రారంభించింది. తప్పుడు ప్రచారం చేసిన సదరు మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలు, ఇతర బాధ్యులకు పరువు నష్టం (Defamation) నోటీసులు జారీ చేయబడుతున్నవి. సమాజంలో గందరగోళం సృష్టించినందుకు గానూ బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయబడుతున్నవి. ప్రజలను, అభ్యర్థులను తప్పుదారి పట్టించేలా నిరాధార ఆరోపణలు చేసిన సదరు మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలు, వ్యక్తులు బహిరంగంగా ప్రజలకు, విద్యాశాఖకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని విద్యాశాఖ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం చేపట్టే అన్ని నియామక ప్రక్రియల్లో పారదర్శకత, నిష్పక్షపాతత్వం, ప్రతిభాధారిత (Merit) ఎంపిక, బాధ్యతాయుత పరిపాలనకు పాఠశాల విద్యాశాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. అభ్యర్థులు ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కోరారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.