
హైదరాబాద్, జనవరి 16: తెలంగాణ గ్రూప్ 3 పోస్టులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) మరో కీలక అప్‌డేట్ జారీ చేసింది. దాదాపు రెండేళ్లకు పైగా నానుతున్న గ్రూప్ 3 పోస్టులకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఇప్పటికే గ్రూప్ 3 ఉద్యోగాలకు రాత పరీక్ష ముగియగా.. ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. తుది మెరిట్ జాబితాను సైతం ఇటీవల కమిషన్ విడుదల చేసింది. ఇక ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదగా నియామక ఉత్తర్వులను శుక్రవారం (జనవరి 16) అందించనున్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ నియామక పత్రాలను అభ్యర్ధులకు అందించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా మొత్తం మొత్తం 1388 గ్రూప్ 3 పోస్టులకు గానూ ఈ నియామక ప్రక్రియ చేపట్టారు. టీజీపీఎస్సీ గ్రూప్ 3 పోస్టుల భర్తీకి సంబంధించి 2024 నవంబర్ 17, 18 తేదీల్లో రాత పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.67 లక్షల మంది ఈ పరీక్షలు రాశారు. దాదాపు ఏడాది తర్వాత వీటి ఫలితాలు కమిషన్ వెల్లడించింది. పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌తో మార్చి 14న విడుదలైంది. ఇటీవల ఈ పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితా విడుదలైంది. ఇందులోని అభ్యర్ధులందరికీ గతేడాది నవంబర్ 10 నుంచి 26వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టింది. గ్రూప్ 3 పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం తుది మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ జారీ చేసింది.
ఆంధ్రప్రేదశ్ రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డీఎంఈ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 97 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఏపీ వైద్యసేవల నియామక బోర్డు (ఏపీఎంఎస్‌ఆర్‌బీ) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. సూపర్ స్పెషాలిటీల్లో క్లినికల్, నాన్-క్లినికల్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీచేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 27వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.