Army Jobs: రక్షణ మంత్రిత్వ శాఖ భారత సైన్యంలో కొత్త రిక్రూట్‌మెంట్ మోడల్‌ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. ఇది మూడు, ఐదేళ్ల సర్వీసులకి సంబంధించినది. ఈ పద్దతిని అమలు చేస్తే దాదాపు 50% మంది ఆర్మీ సైనికులు ఐదేళ్లకే రిటైర్మెంట్ అవుతారు. ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ కింద ఈ రిక్రూట్‌మెంట్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ పద్దతి మొదటిసారిగా 2020లో తెరపైకి వచ్చింది. మీడియా నివేదికల ప్రకారం.. త్వరలోనే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల చాలామంది సైన్యంలో అధికారి హోదాలో దేశానికి సేవ చేయాలనే కోరిక నెరవేరుతుంది. ప్రారంభంలో మొదటగా 100 ఖాళీలను భర్తీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఎంపికైన అభ్యర్థులు ఆర్మీలో అధికారులుగా తక్కువ కాలానికి పనిచేసే అవకాశాన్ని పొందుతారు. ఇప్పటికే ఇలాంటి పద్దతి ఇజ్రాయెల్ లాంటి దేశాలలో నిర్భందంగా కొనసాగుతోంది.
‘టూర్ ఆఫ్ డ్యూటీ’ రిక్రూట్‌మెంట్ మోడల్ అంటే ఏమిటి?
ఈ రిక్రూట్‌మెంట్ కింద ఎంపికైన అభ్యర్థులు 25% మంది ఆర్మీలో మూడేళ్లపాటు పనిచేస్తారు. మరో 25% మంది సైనికులు ఐదేళ్లపాటు సేవలందిస్తారు. అదేవిధంగా మిగిలిన 50% మంది రిటైర్మెంట్ వరకు అంటే పూర్తి కాలానికి ఆర్మీలో కొనసాగుతారు. అధికారులతోపాటు సిబ్బంది కొరతను తీర్చేందుకు ‘టూర్ ఆఫ్ డ్యూటీ’ రిక్రూట్‌మెంట్ మోడల్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ పద్దతి వల్ల యువకులు జీవితాంతం సైన్యంలో పనిచేయాల్సిన అవసరం లేకుండా క్రమశిక్షణతో కూడిన సైనిక జీవితాన్ని అనుభవించడానికి సహాయపడుతుంది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ పద్దతిలో సేవలందించిన ఉద్యోగులకి జాతీయ పెన్షన్ పథకం కింద ప్రయోజనాలు ఉంటాయి. అలాగే సాయుధ దళాల అనుభవజ్ఞులకు వర్తించే నిర్దిష్ట వైద్య ప్రయోజనాలను కూడా అందిస్తారని చెబుతున్నారు. టూర్ ఆఫ్ డ్యూటీ కింద రిక్రూట్ అయినన ఆర్మీ ఆఫీసర్ జీతం నెలకు 80,000 నుంచి 90,000 వరకు ఉంటుందని అంచనా.