CBSE 12వ తరగతి రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్ ప్రారంభం.. జూన్ 6 వరకే అవకాశం!

సీబీఎస్ఈ (CBSE) 12వ తరగతి విద్యార్థులకు కీలక ప్రకటన చేసింది. జవాబు పత్రాల స్కాన్ కాపీల్లో ఉన్న లోపాల పరిశీలన (Verification of Issues), సమాధానాల రీ-ఎవాల్యుయేషన్ (Re-evaluation) కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభమైందని వెల్లడించింది. ఈ సేవలను ఇప్పటికే మూల్యాంకనం చేసిన జవాబు పత్రాల స్కాన్ కాపీలు పొందిన విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటాయని పేర్కొంది..

CBSE 12వ తరగతి రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్ ప్రారంభం.. జూన్ 6 వరకే అవకాశం!
CBSE Class 12th Re Evaluation Portal

Updated on: Jun 03, 2026 | 3:06 PM

న్యూఢిల్లీ, జూన్ 3: ఎట్టకేలకు సీబీఎస్సీ బోర్డు రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్ ను విజయవంతంగా జూన్ 2న ప్రారంభించింది. స్కాన్ కాపీల్లో గుర్తించిన సమస్యల పరిశీలనతో పాటు సమాధానాల రీ-ఎవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకునే పోర్టల్ జూన్ 6వ తేదీ అర్ధరాత్రి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, నిర్ణీత గడువు తర్వాత ఆఫ్‌లైన్‌లో పంపే దరఖాస్తులను బోర్డు ఎట్టిపరిస్థితుల్లోనూ స్వీకరించబోదని స్పష్టం చేసింది. కాగా సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాల విడుదల అనంతరం దాదాపు 20 మంది విద్యార్ధులకు జవాబు పత్రాలు తారుమారు అయినట్లు సీబీఎస్ఈ అంగీకరించింది. ఈ నేపథ్యంలో రీ-ఎవాల్యుయేషన్ ప్రక్రియపై విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున స్కాన్డ్‌ కాపీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు పోటెత్తారు. సాంకేతిక సమస్యలు పూర్తిగా పరిష్కరించి సీబీఎస్ఈ తాజాగా రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌ అందుబుటులోకి తీసుకువచ్చింది.

CBSE రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు.. సైబర్ దాడుల ఆరోపణలు

అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ప్రారంభించిన రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్ తొలి రోజే పలు సాంకేతిక సమస్యలతో విద్యార్థులను ముప్పుతిప్పలు పెట్టింది. చెల్లింపుల వైఫల్యం, లాగిన్ సమస్యలు, స్కాన్ కాపీలు అందకపోవడం వంటి సమస్యలతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. మరోవైపు పోర్టల్‌పై భారీ సైబర్ దాడులు జరిగినట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. పోర్టల్ ప్రారంభమైన కొద్ది సేపటికే కేటుగాళ్లు డినయల్ ఆఫ్ సర్వీస్ (DoS)సై సైబర్‌ దాడికి పాల్పడ్డారు. కేవలం రెండు నిమిషాల్లోనే 15 లక్షల హిట్లు నమోదయ్యాయని, లక్షకు పైగా అనధికారిక ఫైల్ యాక్సెస్ ప్రయత్నాలు జరిగినట్లు బోర్డు పేర్కొంది. అయినప్పటికీ పోర్టల్ ఒకేసారి 14 వేల మంది యూజర్లకు సేవలు అందించిందని, మంగళవారం రాత్రి 10 గంటల నాటికి 28 వేలకుపైగా దరఖాస్తులు విజయవంతంగా సమర్పించినట్లు బోర్డు వెల్లడించింది. వాస్తవానికి రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌ను మే 29న ప్రారంభించాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో జూన్ 1కు వాయిదా వేశారు. అయితే జూన్‌ 1న కూడా పోర్టల్ ప్రారంభం కాలేదు. చివరకు జూన్ 2 తెల్లవారుజామున 4:30 గంటలకు పోర్టల్ అందుబాటులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

పోర్టల్‌లో ఫీజులు యూపీఐ ద్వారా ఫీజు చెల్లిస్తే డబ్బు కట్ అయింది. రసీదులో కూడా సీబీఎస్ఈ చెల్లింపు స్వీకరించినట్లు చూపించింది. కానీ పోర్టల్ మాత్రం ‘పేమెంట్ ఫెయిల్డ్’ అని చూపించినట్లు కొందరు విద్యార్ధులు వాపోయారు. మరికొందరు విద్యార్ధులు లాగిన్ సమస్యలతో అవస్థలు పడ్డారు. అన్ని వివరాలు సరిగా నమోదు చేసినప్పటికీ పోర్టల్ పదేపదే లాగిన్ విఫలమైందని చూపించడంతో విద్యార్దులు గందరగోళంలో పడ్డారు. మరికొందరు విద్యార్థులు సరైన వివరాలు నమోదు చేసినా పోర్టల్ వాటిని తప్పుగా చూపించడంతో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయలేకపోయినట్లు వాపోయారు. కొంతమంది విద్యార్థులు తమ జవాబు పత్రాల స్కాన్ కాపీల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసినప్పటికీ స్కాన్డ్ కాపీలు ఇప్పటివరకు అందలేదని తెలిపారు.

దీంతో రీ-ఎవాల్యుయేషన్ లేదా అభ్యంతరాలు నమోదు చేసే అవకాశం కోల్పోతామేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం (జూన్ 2)న పోర్టల్ ఓపెన్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్కాన్ కాపీలోని లోపాల పరిశీలనకు విద్యార్దులు ఒక్కో జవాబు పత్రానికి రూ.100, రీ-ఎవాల్యుయేషన్‌కు ఒక్కో ప్రశ్నకు రూ.25 చొప్పున చెల్లించాలని సీబీఎస్సీ స్పష్టం చేసింది. ఈ ఫీజులను యూపీఐ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా మాత్రమే చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఒకే దరఖాస్తులో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. అయితే ‘Freeze and Proceed to Payment’ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత మాత్రం వివరాలను మార్చే అవకాశం ఉండదు.

విద్యార్ధులు రీ-వాల్యుయేషన్‌లో ఏయే సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చంటే..?

  • పేజీలు లేకపోవడం
  • సప్లిమెంటరీ షీట్లు జత చేయకపోవడం
  • మ్యాప్స్ లేదా గ్రాఫ్స్ కనిపించకపోవడం
  • స్పష్టంగా కనిపించని పేజీలు
  • తప్పు జవాబు పత్రం అప్లోడ్ కావడం
  • వేరే ప్రశ్నాపత్రం సెట్ ఆధారంగా మూల్యాంకనం జరగడం

రీ-ఎవాల్యుయేషన్‌కు ముఖ్య సూచనలు

రీ-ఎవాల్యుయేషన్ కోసం విద్యార్థులు ప్రశ్న సంఖ్య, పేజీ సంఖ్య వంటి వివరాలను నమోదు చేయాలి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టుల్లోని ప్రశ్నలను రీ-ఎవాల్యుయేషన్‌కు ఎంపిక చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపు పూర్తైన తర్వాత మాత్రమే దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రీ-ఎవాల్యుయేషన్‌కు ఒక్కసారి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే రీ-ఎవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ప్రశ్న సంఖ్య, పేజీ సంఖ్య, ప్రస్తుతం పొందిన మార్కులు, రావాల్సిన మార్కులు, అభ్యంతరానికి గల కారణాలను నమోదు చేయాల్సి ఉంటుంది. మే 19 నుంచి 25 మధ్య స్కాన్ కాపీల కోసం దరఖాస్తు చేసి వాటిని పొందిన విద్యార్థులు జూన్ 6 వరకు ప్రశ్నల వారీగా అభ్యంతరాలు నమోదు చేయవచ్చు. విద్యార్థులు చివరి తేదీ జూన్‌ 6 వరకు వేచి చూడకుండా నిర్ణీత గడువులోపు దరఖాస్తులు పూర్తి చేయాలని సీబీఎస్ఈ సూచించింది. భద్రతా చర్యల్లో భాగంగా ఈసారి బోర్డు ఆధార్ ధృవీకరణను సీబీఎస్ఈ ప్రవేశపెట్టింది. విద్యార్థులకు ఆధార్ లేకపోతే తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధార్ వివరాలను ఉపయోగించవచ్చని తెలిపింది. అయితే నమోదు చేసే పేరు, జనన తేదీ, లింగ వివరాలు ఆధార్‌లో ఉన్నట్లుగానే ఉండాలని సూచించింది.

Follow Us