TS Eamcet 2022: విద్యార్ధులకు అలర్ట్‌! బీఎస్సీ నర్సింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులు కూడా ఎంసెట్‌ రాయాల్సిందే..

|

Apr 27, 2022 | 3:10 PM

తెలంగాణ రాష్ట్రంలో నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ సీట్లనూ 2022-23 విద్యాసంవత్సరం నుంచి ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఈ కోర్సులో..

TS Eamcet 2022: విద్యార్ధులకు అలర్ట్‌! బీఎస్సీ నర్సింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులు కూడా ఎంసెట్‌ రాయాల్సిందే..
Bsc Nursing
Follow us on

BSc Nursing admissions via Telangana Eamcet 2022 ranks: తెలంగాణ రాష్ట్రంలో నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ సీట్లనూ 2022-23 విద్యాసంవత్సరం నుంచి ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఈ కోర్సులో చేరాలంటే ఎంసెట్‌ అగ్రికల్చర్‌ (TS Eamcet Agriculture 2022) విభాగం పరీక్ష రాయడం తప్పనిసరి. అంటే విద్యార్థులు ఇంటర్‌లో బైపీసీ చదివి ఉండాలి. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (INC) జారీ చేసిన గైడ్‌లైన్స్‌ ఆధారంగా ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 2021-22 విద్యా సంవత్సరం నుంచే నర్సింగ్‌ సీట్లను ఏదైనా జాతీయ లేదా రాష్ట్ర ప్రవేశపరీక్ష ద్వారానే భర్తీ చేయాలని జాతీయ నర్సింగ్‌ కౌన్సిల్‌ ఆయా రాష్ట్రాలను ఆదేశించింది. ఆ ఆదేశాలు జారీ చేసేనాటికే ఎంసెట్‌ తదితర ప్రవేశపరీక్షల దరఖాస్తు గడువు ముగిసిందని, వచ్చే(2022-23) విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తామని కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం తెలియజేయగా.. అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ నేపథ్యంలో 2022-23 విద్యాసంవత్సరం నుంచి బీఎస్సీ నర్సింగ్‌ సీట్లను ఎంసెట్‌ ద్వారా భర్తీ చేయాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది.

1998లో ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవో 145లో నిబంధనను సవరించి ఎంసెట్‌ ర్యాంకు ఆధారంగా భర్తీ చేసేలా ప్రభుత్వం కొత్తగా జీవో 39 జారీ చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌ లింబాద్రి తెలిపారు. కళాశాలల్లోని సీట్లలో 60 శాతం కన్వీనర్‌, 40 శాతం యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తారు. తాము ఎంసెట్‌ నిర్వహించి అభ్యర్థులకు ర్యాంకులు కేటాయిస్తామని, ఆ తర్వాత కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్‌ నిర్వహించి కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేస్తుందని వివరించారు. ఇప్పటివరకూ ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సులో మార్కుల ఆధారంగా కన్వీనర్‌ కోటాలోని సీట్లను భర్తీ చేసేవారు.

యాజమాన్య కోటా సీట్ల భర్తీ ఇంటర్‌ మార్కులా ద్వారానా.. లేదా నీట్ ర్యాంకు ద్వారానా..?
యాజమాన్య కోటా కింద 40 శాతం సీట్లను ఇప్పటివరకు ఇంటర్‌ మార్కుల ఆధారంగా ఆయా కళాశాలలే ఎంపిక కమిటీల ద్వారా భర్తీ చేసేవి. ఇకనుంచి నీట్‌-యూజీ ర్యాంకులను పరిగణనలోకి తీసుకోవాలని జీవోలో పేర్కొన్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు కన్వీనర్‌ కోటా కోసం ఎంసెట్‌, యాజమాన్య కోటా కోసం నీట్‌.. రెండు పరీక్షలు రాయాల్సి వస్తుంది కదా అన్న ప్రశ్న నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. యాజమాన్య కోటా సీట్లకు తొలుత నీట్‌, ఆ తర్వాత ఎంసెట్‌ ర్యాంకులను పరిగణనలోకి తీసుకోవాలని.. ఆయా ర్యాంకర్లు లేకుంటే ఇంటర్‌ మార్కుల ఆధారంగా కేటాయించాలన్న డిమాండ్‌ వస్తోంది.

కాగా తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌ దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 6న ప్రారంభం కాగా.. ఆలస్య రుసుం లేకుండా మే 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి వీలుందని ఆచార్య లింబాద్రి తెలిపారు. నర్సింగ్‌ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈసారి నర్సింగ్‌ కోర్సు కూడా చేరినందున దరఖాస్తులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Also Read:

CBSE Syllabus 2022: రాజకీయ శక్తులకు కొమ్ముకాస్తున్న సీబీఎస్సీ బోర్డు! ఆరోపణల్లో నిజమెంత..?