
అమరావతి, నవంబర్ 2: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2025 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి టెట్ పరీక్షకు రెగ్యులర్ అభ్యర్థులతో పాటు ఇన్ సర్వీస్ టీచర్లు కూడ పోటీ పడుతున్నారు. అక్టోబర్ 24 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమవగా.. నవంబర్ 23 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. నవంబర్ 25న ఆన్‌లైన్ మాక్ టెస్ట్ నిర్వహిస్తారని, డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఇక టెట్ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 10న 2 షిఫ్టుల్లో ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. ఈ క్రమంలో మైనారిటీ అభ్యర్థులకు ‘టెట్’ పరీక్షకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తాజాగా ప్రకటనలో వెల్లడించారు. నవంబర్ మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, కోచింగ్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధానాల్లోనూ అందిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (సీఈడీఎం) వెబ్‌సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల పాఠశాలల్లో(భవితా కేంద్రాలు) స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు సైతం టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) అర్హత ఉండాల్సిందేనని హైకోర్టు అక్టోబరు 31న స్పష్టం చేసింది. ఈ మేరకు తీర్పు వెలువరించింది. సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ టీచర్ల కేడర్లలోని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకాలకు టెట్ అర్హత నుంచి మినహాయింపు ఇవ్వాలని పలువురు వేర్వేరుగా హైకోర్టులో 3 పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఆర్‌సీఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక టీచర్లకు కూడా టెట్ అర్హతను నిర్దేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 4 రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనికి కౌంటర్‌గా ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్‌సీటీఈ ప్రకారం ప్రత్యేక టీచర్లకు టెట్ ఉండాల్సిందేనని, వారికి మినహాయింపు ఇవ్వడం కుదరదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌లను కొట్టివేసింది. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు కూడా టెట్‌లో అర్హత సాధించాల్సిందేనని తీర్పు ఇచ్చింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.