‘సర్వీసులో ఉన్న టీచర్లందరికీ ఒకే TET అర్హత మార్కులు ఉండాల్సిందే’

సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న టెట్‌లో అర్హత మార్కులను అందరికీ ఒకేలా నిర్ణయించాలని యూటీఎఫ్‌ డిమాండ్‌ చేసింది. 2010కి ముందు ఉద్యోగంలో చేరిన టీచర్లకు టెట్‌ మినహాయింపు ఇవ్వాలని, గణితం, సైన్స్‌ ఉపాధ్యాయులకు వారి సబ్జెక్టుల్లోనే పరీక్ష నిర్వహించాలని కోరింది. డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఆగస్టు 26 నుంచి నిరసనలు, సెప్టెంబర్‌ 3న చలో విజయవాడ, సెప్టెంబర్‌ 4 నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించింది..

సర్వీసులో ఉన్న టీచర్లందరికీ ఒకే TET అర్హత మార్కులు ఉండాల్సిందే
Same TET Qualifying Marks for All Teachers

Updated on: Aug 28, 2026 | 8:20 PM

అమరావతి, ఆగస్ట్‌ 28: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET)లో కనీస అర్హత మార్కులను అందరికీ ఒకేలా నిర్ణయించాలని యునైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (UTF) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు యూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాద్‌ విజయవాడలోని సంఘ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. 2010కి ముందు సర్వీసులో చేరిన ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలంటే విద్యా హక్కు చట్టంలోని సెక్షన్‌ 23(1)కు సవరణ చేయాల్సి ఉంటుందని యూటీఎఫ్‌ నేతలు తెలిపారు. కేంద్రం, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.

సర్వీసులో ఉన్న టీచర్లకు కొత్త అభ్యర్థుల మార్కులేనా?

ప్రస్తుతం కొత్తగా ఉపాధ్యాయ నియామకాలకు పోటీపడే అభ్యర్థులు సాధించాల్సిన అర్హత మార్కులనే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేశారని యూటీఎఫ్‌ నేతలు పేర్కొన్నారు. ఇది సర్వీసులో ఉన్న టీచర్లకు ఇబ్బందికరంగా మారుతోందని తెలిపారు. ముఖ్యంగా గణితం, సామాన్యశాస్త్రం ఉపాధ్యాయులకు ఆయా సబ్జెక్టుల్లో కేవలం 20 మార్కులకు మాత్రమే ప్రశ్నలు ఉంటాయని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో 60 శాతం మార్కులు సాధించడం కష్టంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. గణితం, సైన్స్‌ ఉపాధ్యాయులకు వారి సంబంధిత సబ్జెక్టుల్లోనే పరీక్ష నిర్వహించాలని యూటీఎఫ్‌ డిమాండ్‌ చేసింది. టెట్‌లో అర్హత మార్కులను తగ్గించడం లేదా ఆయా ఉపాధ్యాయులకు వారి సబ్జెక్టుల్లోనే పరీక్ష నిర్వహించడం వంటి మార్పులకు ఎన్‌సీటీఈ అనుమతి తీసుకోవచ్చని తెలిపింది. అయితే ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తగిన కార్యాచరణ చేపట్టడం లేదని యూటీఎఫ్‌ నేతలు ఆరోపించారు. అందువల్లే తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటించాల్సి వచ్చిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఆగస్టు 26 నుంచి నిరసనలు.. సెప్టెంబర్‌ 3న చలో విజయవాడ

టెట్‌ నిబంధనల్లో మార్పులు చేయాలని కోరుతూ యూటీఎఫ్‌ పలు దశల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఆగస్టు 26 నుంచి 30 వరకు జిల్లాల్లో బైక్‌ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అనంతరం సెప్టెంబర్‌ 3న ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించింది. విద్యాశాఖ మంత్రి స్పందించకపోతే సెప్టెంబర్‌ 4 నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని యూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హెచ్చరించారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల టెట్‌ అర్హత మార్కులు, పరీక్ష విధానంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని యూటీఎఫ్‌ కోరింది.

Loading...
Unable to load recommendations.
Follow Us