
అమరావతి, ఆగస్ట్ 25: ఆంధ్రప్రదేశ్ స్పెషల్ టెట్ 2026కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 25, 2026వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచే ప్రారంభమైంది. అర్హత కలిగిన ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు సెప్టెంబర్ 24 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో పేపర్‌కు దరఖాస్తు ఫీజు రూ.1000గా నిర్ణయించారు. దరఖాస్తులను ఏపీ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సమర్పించాలి.
స్పెషల్ టెట్ పరీక్షలను అక్టోబర్ 11 నుంచి 21 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) విధానంలో నిర్వహించనున్నారు. పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం సెషన్ 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థులు అక్టోబర్ 5 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 24న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీపై అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. నవంబర్ 10న తుది కీ, నవంబర్ 15న తుది ఫలితాలను ప్రకటించనున్నారు. కాగా ప్రత్యేక టెట్ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, మార్గదర్శకాలు, అర్హతలు, దరఖాస్తు విధానం తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు నోటిఫికేషన్‌ను పూర్తిగా పరిశీలించి, తమ అర్హతను నిర్ధారించుకున్న తర్వాత నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఏపీ స్పెషల్ టెట్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో 2011కు ముందు ప్రభుత్వ బడుల్లో టీచర్లుగా నియమితులైన అర్హత కలిగిన ఇన్-సర్వీస్ టీచర్లు టెట్ అర్హత సాధించేందుకు ప్రత్యేక పరీక్ష నిర్వహించేందుకుఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రత్యేక టెట్ ద్వారా సంబంధిత ఉపాధ్యాయులకు నిర్దేశిత గడువులో టెట్ అర్హత సాధించే అవకాశం కల్పిస్తున్నారు. అర్హత, పేపర్ల ఎంపిక, దరఖాస్తు విధానం, పరీక్ష సిలబస్ తదితర పూర్తి వివరాలను అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో పరిశీలించిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాలి.