అమరావతి, అక్టోబర్ 5: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొన్న విద్యార్ధులకు సీట్లు కేటాయించారు. మొత్తం 15,777 మంది విద్యార్ధులకు కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయించినట్లు కన్వీనర్ రామమోహనరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఐసెట్ 2023 ప్రవేశాలకు నిర్వహించిన కౌన్సెలింగ్‌కు 19,021 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా వీరిలో 17,143 మంది అభ్యర్థులు ఐచ్ఛికాలు నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని వైద్య కాలేజీల్లో మొదటి విడత కౌన్సెలింగ్ తర్వాత మిగిలి పోయిన మెడికల్ పీజీ సీట్లకు విజయవాడ వైఎస్‌ఆర్ ఆరోగ్య యూనివర్సిటీ రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించించింది. రెండో విడత కౌన్సెలింగ్‌లో దాదాపు 507 మందికి వివిధ విభాగాల్లో సీట్లు కేటాయించినట్లు వర్సిటీ పేర్కొంది. రెండో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఆయా మెడికల్ కాలేజీల్లో అక్టోబరు 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా చేరాలని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పీజీ మెడికల్ సీట్లకు నిర్వహించిన మొదటి విడత కౌన్సెలింగ్ తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సెల్ (MCI) జీరో పర్సంటైల్ మార్కుల అర్హత ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నీట్ పీజీలో సున్నా మార్కులు వచ్చినా పీజీ సీటు పొందడానికి అర్హులుగా మెడికల్ కౌన్సెల్ ప్రకటించింది. పరీక్షకు హాజరైన విద్యార్ధులందరూ సీటు పొందడానికి అర్హత సాధించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి ఏటా మూడు విడతల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది మాత్రం రెండు విడతల కౌన్సెలింగ్‌తో ప్రభుత్వం సరిపెట్టింది. మూడో విడత కౌన్సెలింగ్ ఉంటుందని కొందరు విద్యార్థులు ఇప్పటి వరకు ఎదురు చూసినా మూడో విడత కౌన్సెలింగ్ ఉండదని తెల్పుతూ.. నేరుగా స్పాట్‌కు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ వెలువరించింది. స్పాట్ కింద ప్రవేశాలు పొందే విద్యార్థులకు బోధన రుసుము ఉండదు. మూడో విడత కౌన్సెలింగ్ ద్వారా చేరితే మాత్రం విద్యార్ధులకు ప్రభుత్వమే బోధన రుసుం చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటి వరకు సీట్లు పొందని విద్యార్థులు అక్టోబరు 3న ఉన్నత విద్యామండలి ఆఫీస్‌కు వెళ్లి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ చేపట్టాలని అభ్యర్ధించారు. ఫీజుల డబ్బులను మిగుల్చుకునేందుకు మూడో విడత కౌన్సెలింగ్‌ను ప్రభుత్వం ఎత్తివేసిందని విమర్శించారు. వెంటనే మూడో విడత కౌన్సెలింగ్ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చినందున చాలా కాలేజీల్లో సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.