
అమరావతి, మే 26: గతేడాది జారీ చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందే 2024 అక్టోబర్ 3 నుంచి 21 వరకు ఏపీ టెట్ నిర్వహించారు. అనంతరం సీపీటీ విధానంలో జూన్ 6 నుంచి జూలై 2వ తేదీ వరకు రెండు షిఫ్టుల్లో డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. దీంతో అభ్యర్థులు టెట్ పరీక్షలు నిర్వహించినప్పుడల్లా అభ్యర్థులు మార్కులు పెంచుకునేందుకు పరీక్షలు రాస్తారు. ఇందులో ఎక్కువగా వచ్చిన మార్కులనే డీఎస్సీలో పరిగణనలోకి తీసుకుంటారు. అయితే విద్యాశాఖ వద్ద గతంలో నిర్వహించిన టెట్ స్కోర్ వివరాలు లేకపోవడంతో అభ్యర్థులనే నేరుగా ఆన్‌లైన్‌లో టెట్ స్కోరు సవరించుకోవాలని కోరింది.
ఇలా నెలరోజుల్లో దాదాపు నాలుగు సార్లు అవకాశం ఇచ్చింది. ఎవరు ఎంత వేశారో లెక్కాపత్రం సర్కారు వద్ద లేకపోవడంతో వారు ఇచ్చిన టెట్ మార్కుల ప్రకారమే ఆగస్ట్ 13న సవరించిన టెట్ స్కోర్‌తో డీఎస్సీ స్కోరు కార్డులు విడుదల చేశారు. అనంతరం సెప్టెంబర్ 19న నియామక పత్రాలు జారీ చేస్తామని ప్రకటించినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో సెప్టెంబర్ 25న ఆ కార్యక్రమం జరిగింది. ఈ 6 రోజుల వ్యవధిలో తొలుత ఎంపికైన అభ్యర్ధులకు ఫోన్ చేసి మీరు పోస్టుకు ఎంపిక కాలేదని, వేడుకలకు రావొద్దని చెప్పడంతో పలు అనుమానాలు తలెత్తాయి. ఇలా దాదాపు 100 మందికిపైగా ఉండటంతో వీరంతా కోర్టును ఆశ్రయించారు. కొందరికీ నియామక పత్రాలు శిక్షణ సమయంలో అందజేయడం అనుమానాలకు ఆజ్యం పోసినట్లైంది. మరోవైపు ఫేక్ సర్టిఫికెట్లకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కల్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో విద్యాశాఖ క్లారిటీ ఇస్తూ సోమవారం (మే 25) ప్రకటన జారీ చేసింది.
మెగా DSC 2025 లీక్ ఆరోపణలపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ.. మెగా డీఎస్సీ-2025 పై వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం, నిరాధారమైనవని కొట్టి పారేసింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానంలో పరీక్షల నిర్వహణతో ప్రశ్నాపత్రాల లీకేజీ పూర్తిగా అసాధ్యం. డీఎస్సీ పరీక్షల్లో ఎలాంటి పేపర్ లీక్, డేటా డిలీట్ కాలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పి. నవీన్ డీఎస్సీ నిర్వహణకు, మూల్యాంకనానికి ఎలాంటి సంబంధం లేదు. అనుమతి లేకుండా పరీక్ష రాయడం, వెరిఫికేషన్ కు హాజరుకాకపోవడంతోనే నవీన్ అభ్యర్థిత్వం రద్దు చేసినట్లు తెలిపింది. హైకోర్టు ఆదేశాల ప్రకారమే నవీన్ గ్రీవెన్స్ పిటిషన్ ను కమిటీలు విచారించి పరిష్కరించాయి. అన్నమయ్య, కడప జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ పోస్టుల భర్తీ పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగింది. మహిళలు, దివ్యాంగులు, స్పోర్ట్స్ కోటాకు హారిజాంటల్ రిజర్వేషన్ల అమలు చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా జరిగింది. హారిజాంటల్ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర కార్యాలయం కేవలం సాంకేతిక సమన్వయం మాత్రమే అందించింది. డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియను ఆయా జిల్లాల ఎంపిక కమిటీలు (DSCs), DEOలే స్వయంగా ఖరారు చేశారు.
అభ్యర్థులు స్వచ్ఛందంగా ఇచ్చుకున్న పోస్ట్ ప్రిఫరెన్స్ ఆధారంగానే ఆటోమేటెడ్ విధానంలో కేటాయింపులు జరిగాయి. నోటిఫికేషన్ విడుదలైన కేవలం 148 రోజుల రికార్డు సమయంలోనే నియామక ప్రక్రియ పూర్తి చేశాం. అధికారిక వెబ్ సైట్ లో పూర్తి మెరిట్ జాబితాలు ప్రచురించిన తర్వాతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించాం. జాయింట్ డైరెక్టర్ (TET) పోస్టుకు డీఎస్సీ బాధ్యతలు అప్పగించడం నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని పాఠశాల విద్యా శాఖ క్లారిటీ ఇచ్చింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.