Mega DSC 2025 Certificates: మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ వాయిదా..! కారణం ఇదే..

AP Mega DSC 2025 Certificates Verification postponed: మెగా డీఎస్సీలో అత్యుత్తమ ప్రతిభకనబరచిన అభ్యర్ధులకు కాల్‌ లెటర్లను విద్యాశాఖ అధికారులు మంజూరు చేయనున్నారు. రిజర్వేషన్ల ఆధారంగా కటాఫ్‌ మార్కులను నిర్ణయించిన అధికారులు.. ర్యాంకులు కూడా కేటాయించారు. పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 1:1 విధానంలో కాల్‌లెటర్లు..

Mega DSC 2025 Certificates: మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ వాయిదా..! కారణం ఇదే..
AP Mega DSC 2025 Certificates Verification

Updated on: Aug 25, 2025 | 11:32 AM

అమరావతి, ఆగస్ట్‌ 25: రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మెగా డీఎస్సీ మెరిట్‌ జాబితా ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అత్యుత్తమ ప్రతిభకనబరచిన అభ్యర్ధులకు కాల్‌ లెటర్లను విద్యాశాఖ అధికారులు మంజూరు చేయనున్నారురు. రిజర్వేషన్ల ఆధారంగా కటాఫ్‌ మార్కులను నిర్ణయించిన అధికారులు.. ర్యాంకులు కూడా కేటాయించారు. పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 1:1 విధానంలో కాల్‌లెటర్లు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్టు 24న అభ్యర్థుల లాగిన్‌కు కాల్‌ లెటర్లు పంపించి, ఆగస్టు 25 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన చేయాల్సి ఉంది. కానీ ఇంత వరకు వీటిని సిద్ధం చేయకపోవడంతో సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రకటించింది.

రిజర్వేషన్లు, స్థానికత ఆధారంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల మేరకు కాల్‌లెటర్లు జారీచేయాల్సి ఉంది. ఇందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ఒకటికి రెండుసార్లు జాబితాలను పరిశీలిస్తున్నారు. కాల్‌ లెటర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా పడింది. కాల్‌ లెటర్లను ఆగస్టు 25న ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్‌లో ఉంచుతామని అధికారులు తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ అంతా సెప్టెంబరు మొదటి వారంలోగా పూర్తి చేసేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు రెండో వారంలో పాఠశాలల్లో చేరేలా పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ రూపొందించింది.

డీఎస్సీలో కొంతమంది అభ్యర్థులు ఒకటికి మించి పోస్టులకు టాపర్లుగా నిలిచారు. దీంతో ఒక్కొక్కరు రెండు, మూడు పోస్టులకు ఎంపికయ్యారు. వీరు ఏదైనా ఒక పోస్టు ఎంచుకుంటే మిగతా పోస్టులు ఖాళీ ఏర్పడే అవకాశం ఉంది. అయితే, దరఖాస్తు సమయంలో పోస్టులకు ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారమే ఇలాంటి వారందరికీ అధికారులు పోస్టు కేటాయించనున్నారు. రెండు, మూడు పోస్టులకు అర్హత సాధించినా దరఖాస్తు సమయంలో మొదటి ప్రాధాన్యం ఇచ్చిన పోస్టుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. మెరిట్‌లో ఆ తర్వాత కింద ఉన్న అభ్యర్థి మిగతా పోస్టులను కేటాయిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.