
అమరావతి, నవంబర్ 14: చూస్తుండగానే 2025 సంవత్సరం కళ్ల ముందు ఇట్టే కరిగిపోయింది. ఇక బడి పిల్లలకైతే ఈ ఏడాది మొత్తం ఎక్కువగా సెలవులతో స్కూల్ డేస్ గడిచిపోయాయి. సెలవులంటే పిల్లలకు ఎక్కడిలేని ఉత్సాహం వస్తుందన్న సంగతి తెలిసిందే. జాతీయ, రాష్ట్రీయ పండగ దినాలతోపాటు ఎలక్షన్లు, వానలు, ఆదివారాలు, రెండో, నాలుగవ శనివారాలతో కలిపి మరిన్ని సెలవులు వచ్చాయి. నవంబర్, డిసెంబర్‌లల్లోనూ విద్యా సంస్థలకు భారీగానే సెలవులు రానున్నాయి. ముఖ్యంగా మునుముందు క్రిస్మస్, సంక్రాంతి సెలవులు, ఆ తర్వాత వేసవి సెలవులు భారీగా రానున్నాయి.
వచ్చే నెలలో అంటే డిసెంబర్ నెలలో మైనార్టీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ 21 నుంచి 28వ తేదీ వరకు రానున్నాయి. అంటే మొత్తం 8 రోజులన్నమాట. డిసెంబర్ 29వ తేదీ సోమవారం నుంచి తిరిగి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఆదే వారం గురువారం జనవరి 1 నూతన సంవత్సరం వస్తుంది. దీంతో డిసెంబర్ నెలలో భారీగానే సెలవులు ఉండే అవకాశం ఉంది. భారీగా సెలవులు రానుండటంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ముందు నుంచే పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. లాంగ్ టూర్ లేదంటే బంధువుల ఇళ్లకు వెళ్లే ప్రోగ్రామ్‌లు ప్లాన్ చేసుకుంటున్నారు.
మైనార్టీ విద్యాసంస్థల సంగతి పక్కన బెడితే మిగతా విద్యాసంస్థలకు క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25, 2025వ తేదీన పబ్లిక్ సెలవుగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇక డిసెంబర్ 26వ తేదీన బాక్సింగ్ డే ఉంది. ఆ తర్వాత డిసెంబర్ 27 శనివారం, డిసెంబర్ 29 ఆదివారం కలిపి మొత్తం 4 రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది. శనివారం కూడా సెలవు ఇస్తే మొత్తం నాలుగు రోజుల వరకు స్కూళ్లకు సెలవులు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. ప్రకటన అనంతరం విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులపై స్పష్టత రానుంది. వీరికి డిసెంబర్ 29న సోమవారం తిరిగి పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. మరోవైపు తెలంగాణలోనూ క్రిస్మస్ సెలవులు సరిగ్గా ఇదే తేదీల్లో ప్రకటించే అవకాశం ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.