
దేశ రక్షణకు అవసరమైన త్రివిధ దళాలను తయారు చేయడానికి పాఠశాల విద్య నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో దేశ వ్యాప్తంగా సైనిక పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిల్లో ప్రతీయేట ప్రవేశాలు కల్పిస్తుంది. ఇందులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి ఆరు, తొమ్మిదో తరగతులకు ప్రవేశాలు కల్పించడానికి ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AISSEE 2026) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఎన్‌టీఏ (NTA) ప్రకటన వెలువరించింది. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఎవరైనా అక్టోబర్ 30, 2025వ తేదీ సాయంత్రం 5గంటలలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆరో తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరానికి ఐదో తరగతి చదువుతూ ఉండాలి. 2026 మార్చి 31 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. అలాగే తొమ్మిదో తరగతిలో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతూ ఉండాలి. వీరి వయస్సు 13 నుంచి 15 ఏళ్లు మధ్య ఉండాలి. ఈ పాఠశాలల్లో బాలురుతోపాటు బాలికలకు సైతం ప్రవేశాలు కల్పిస్తారు. సీట్లు, అర్హతలు అందరికీ సమానంగా ఉంటాయి. ఈ స్కూళ్లన్నీ సీబీఎస్‌ఈ అనుబంధ ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలు. అంటే సీబీఎస్సీ సిలబస్ కలిగిన రెసిడెన్సీ స్కూళ్లు ఇవి. ఇందులో ప్రవేశాలు పొందిన వారికి ఉచిత విద్యతోపాటు వసతి, భోజన సదుపాయం కూడా కల్పిస్తారు.
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుం కింద జనరల్, రక్షణ రంగంలో పనిచేస్తున్నవారి పిల్లలు, ఓబీసీలు (నాన్ క్రిమీలేయర్), ఎక్స్ సర్వీస్‌మెన్ పిల్లలు రూ.850, ఎస్సీ,ఎస్టీ కేటగిరీలకు చెందిన వారు రూ.700ల చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుం అక్టోబర్ 31 రాత్రి 11.50 గంటల వరకు చెల్లించవచ్చు. దరఖాస్తుల్లో పొరపాట్లను సవరించుకునేందుకు నవంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ప్రవేశ పరీక్ష ఆధారంగా విద్యార్ధులకు సీట్లు కేటాయిస్తారు. పరీక్ష 2026 జనవరి నెలలో నిర్వహిస్తారు. అయితే తాజా ప్రకటనలో రాత పరీక్ష తేదీని ఇంకా వెల్లడించలేదు. పరీక్ష జరిగిన నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. ఆరో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2గంల నుంచి సాయంత్రం 4.30గంటలవరకు (150 నిమిషాలు), తొమ్మిదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటలవరకు (180 నిమిషాలు) ఒకే రోజున జరుగుతుంది. రాత పరీక్ష పెన్ను, పేపర్ (OMR షీట్) విధానంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు (MCQ) జరుగుతుంది. ఈ పరీక్షలో మెరిట్ ఆధారంగా సీట్లు పొందిన విద్యార్ధులను నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవీ అకాడమీ, ఇతర శిక్షణా అకాడమీలకు సిద్ధం చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో సైనిక పాఠశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి, పరీక్షా విధానం, సిలబస్ వంటి వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.