
హైదరాబాద్, జనవరి 14: ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AISSEE 2026) ప్రవేశ పరీక్ష మరో 4 రోజుల్లో జరగనుంది. ఈ క్రమంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ఆరో తరగతి, 9వ తరగతుల్లో ప్రవేశాలకుగానూ ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఆఫ్‌లైన్ విధానంలో అంటే పెన్ను, పేపర్ (OMR షీట్) విధానంలో జనవరి 18న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్ష జరగనుంది.
ఆరో తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటలవరకు మొత్తం 150 నిమిషాల వ్యవధిలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. మొత్తం 125 ప్రశ్నలకు 300 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. లాంగ్వేజ్ విభాగం నుంచి 25 ప్రశ్నలకు 50 మార్కులు, మ్యాథమెటిక్స్ విభాగం నుంచి 50 ప్రశ్నలకు 150 మార్కులు, ఇంటెలిజెన్స్ విభాగం నుంచి 25 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ నాలెడ్జ్ విభాగం నుంచి 25 ప్రశ్నలకు 50 మార్కులు చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ఇక తొమ్మిదో తరగతి విద్యార్థులకు అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు మొత్తం 180 నిమిషాల వ్యవధిలో పరీక్ష జరుగుతుంది. రెండు పరీక్షలకు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలను మాత్రమే అడుగుతారు.
తొమ్మిదో తరగతి ప్రశ్నాపత్రంలో మొత్తం 150 ప్రశ్నలకు 400 మార్కులకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. మ్యాథమెటిక్స్ విభాగం నుంచి 50 ప్రశ్నలకు 200 మార్కులు, ఇంటెలిజెన్స్ విభాగం నుంచి 25 ప్రశ్నలకు 50 మార్కులు, ఇంగ్లిష్ విభాగం నుంచి 25 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్ సైన్స్ విభాగం నుంచి 25 ప్రశ్నలకు 50 మార్కులు, సోషల్ సైన్స్ విభాగం నుంచి 25 ప్రశ్నలకు 50 మార్కులు చొప్పున ప్రశ్నలు అడుగుతారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్ నుంచి తెలుసుకోవచ్చు.
సైనిక్ స్కూల్ 2026 అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.