డిఫెన్స్ జాబ్ కోసం ఇదే గోల్డెన్ ఛాన్స్.. అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ డిటైల్స్ ఇవే!

కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్ పథకం కింద వివిధ కేటగిరీల్లో దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 1 చివరి తేదీ. ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జూన్ 1-15 మధ్య 13 భాషల్లో జరుగుతుంది. గరిష్ఠ వయోపరిమితి 21 నుండి 22 ఏళ్లకు పెరిగింది. ఐటీఐ, డిప్లొమా, ఎన్‌సీసీ అర్హత ఉన్నవారికి బోనస్ మార్కులుంటాయి. మోసగాళ్లను నమ్మవద్దని ఆర్మీ హెచ్చరించింది.

డిఫెన్స్ జాబ్ కోసం ఇదే గోల్డెన్ ఛాన్స్.. అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ డిటైల్స్ ఇవే!
Agnipath Recruitment

Edited By:

Updated on: Feb 14, 2026 | 9:43 PM

కేంద్ర ప్రభుత్వం అగ్నివీర్‌ పథకం కింద వివిధ కేటగిరీల్లో అవివాహిత యువత నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఫిబ్రవరి 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో శాశ్వత నివాసితులైన అభ్యర్థులు ఈ నియామకానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మన్ (10వ తరగతి పాస్), అగ్నివీర్ ట్రేడ్స్‌మన్ (8వ తరగతి పాస్) విభాగాల్లో ఎంపిక ఉంటుంది. అర్హతను బట్టి అభ్యర్థులు రెండు కేటగిరీల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

ఇక ఈసారి అన్ని కేటగిరీల్లో గరిష్ఠ వయోపరిమితిని 21 నుంచి 22 ఏళ్లకు పెంచారు. అభ్యర్థుల కోసం నిర్వహించే ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (CEE)ను తెలుగు సహా 13 భాషల్లో నిర్వహించనున్నారు. అలాగే ఐటీఐ, డిప్లొమా, ఎన్‌సీసీ అర్హత ఉన్నవారికి బోనస్ మార్కులు కూడా కేటాయిస్తామని అధికారులు తెలిపారు.

దరఖాస్తుల స్వీకరణకు ఆన్‌లైన్ విండో ఇప్పటికే తెరిచినట్లు, ఏప్రిల్ 1తో దరఖాస్తుల గడువు ముగుస్తుందని ఆర్మీ పేర్కొంది. పరీక్షను జూన్ 1 నుంచి జూన్ 15 మధ్యలో నిర్వహించే అవకాశం ఉందని, సంబంధిత అడ్మిట్ కార్డులను ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది. అభ్యర్థులు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌ను పరిశీలిస్తూ అప్డేట్స్ తెలుసుకోవాలని, అలాగే అడ్మిట్ కార్డుల కోసం రిజిస్టర్ చేసిన ఈమెయిల్ ఐడీలను కూడా చెక్ చేయాలని ఆర్మీ సూచించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్‌ను 040-27740059 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపింది. ఈ నియామక ప్రక్రియలో దళారులు, మోసగాళ్ల మాటలు నమ్మొద్దని ఆర్మీ స్పష్టంగా హెచ్చరించింది. పాస్ చేయిస్తాం, ఎన్‌రోల్ చేయిస్తాం.. అంటూ ఎవరు చెప్పినా అది మోసమేనని, అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..