ఉద్యోగ ప్రయత్నంలో 50 సార్లు ఫెయిల్‌.. BTech గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య

Kanpur BTech gold medallist Death: బీటెక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ ప్రభుత్వ ఉద్యోగాల కోసం సుమారు 50 సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించలేకపోయాననే తీవ్ర నిరాశతో ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. అసలేం జరిగిందంటే..

ఉద్యోగ ప్రయత్నంలో 50 సార్లు ఫెయిల్‌.. BTech గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య
Kanpur BTech gold medal list death

Updated on: Jul 20, 2026 | 6:25 AM

లక్నో, జులై 20: కాన్పూర్‌లోని గోవింద్ నగర్‌లోని గుజైని ప్రాంతంలో నివసించే ఆనంద్ (23) 2024లో PSIT అనే ప్రైవేట్ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులో టాపర్‌గా నిలిచాడు. ఉత్తరప్రదేశ్‌లో మూడవ ర్యాంకు సాధించాడు. దీంతో 2024 ఆగస్ట్‌ 13న జరిగిన కాలేజీ కార్యక్రమంలో ఆతనికి గోల్డ్‌ మెడల్‌ బహుకరించారు. అయితే తాజాగా ఆనంద్‌ అన్న వివాహ ఏర్పాట్ల కోసం అతని కుటుంబ సభ్యులు బీహార్‌ వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆనంద్‌ తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి పనిమనిషి ఎన్నిసార్లు తలుపుతట్టినా ఎంతకీ డోర్‌ తీయకపోవడంతో ఇరుగు పొరుగువారితోపాటు, పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. ఆనంద్‌ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. అదే గదిలో చేతిరాతతో ఉన్న ఐదు లైన్ల లేఖ కూడా పోలీసులకు లభించింది.

అందులో ‘క్షమించండి నాన్నా, ప్రభుత్వ ఉద్యోగం కోసం దాదాపు 50 సార్లు ప్రయత్నించాను. కానీ సఫలం కాలేకపోయాను. దయచేసి నన్ను క్షమించండి’ అని రాసి ఉంది. పోలీసులు పోస్ట్‌మార్టం తర్వాత ఆనంద్‌ మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. శనివారం (జులై 18) సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. అతడి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు.

తన కుమారుడు గ్రాడ్యుయేషన్ తర్వాత పోటీ పరీక్షలపై దృష్టి పెట్టడానికి ముందు పవర్ గ్రిడ్‌లో ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ పూర్తి చేశాడని ఆనంద్ తండ్రి రాజ్‌కుమార్ చెప్పారు. అతను రైల్వే, ఎస్‌ఎస్‌సి, బ్యాంకులు, విద్యా శాఖ నిర్వహించిన నియామక పరీక్షలకు హాజరయ్యాడు. కానీ విజయం సాధించలేకపోయాడు. దీంతో గత కొన్ని నెలలుగా తన కుమారుడు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడని రాజ్‌కుమార్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించలేకపోవడం వల్ల అతను ఒత్తిడికి లోనైనట్లు ప్రాథమిక విచారణలో తెలుస్తోందని, అయితే కేసులోని అన్ని కోణాల్లోనూ విచారణ జరుగుతోందని గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశోక్ కుమార్ దుబే తెలిపారు. చదువులో రాణించిన ఒక యువ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మరణం చుట్టూ ఈ కేసు కేంద్రీకృతమై ఉండటంతో దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

ఇవి కూడా చదవండి

నోట్: ఏ సమస్యకు సూసైడ్ పరిష్కారం కాదు. సమస్యను ఎదిరించి పోరాడటంలోనే ఉంది అసలైన సత్తా.. చనిపోవడమంటే తప్పించుకుని పారిపోవడంతో సమానం. ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటేనే నీవేంటో ఈ లోకం చూస్తుంది. అంత ధైర్యం లేకుంటే స్నేహితులు, సన్నిహితుల సహాయం తీసుకోవాలి. లేదంటే మానసిక నిపుణులను కలిస్తే మీకు కావల్సిన ధైర్యం తప్పక అందుతుంది.

Follow Us