
హైదరాబాద్, అక్టోబర్ 2: కేంద్ర మంత్రి బుధవారం (అక్టోబర్ 1) 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించడానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలలో 7 కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా స్పాన్సర్ చేస్తారు. మిగిలినవి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్పాన్సర్ చేస్తాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మొత్తం 1,288 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
వీటిలో ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయాలులేని జిల్లాల్లో 20 పాఠశాలలు, నీతి ఆయోగ్ ప్రభుత్వ కార్యక్రమాల కోసం ఎంపిక చేసిన అభివృద్ధి చెందని జిల్లాల్లో 14 పాఠశాలలు, వామపక్ష తీవ్రవాదం (LWE) ప్రభావిత జిల్లాల్లో నాలుగు, ఈశాన్య కొండ ప్రాంతాల్లో 5 పాఠశాలలు నిర్మించనున్నారు. కేంద్రీయ విద్యాలయాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల కోసం ఉద్దేశించినవి. తాజాగా పెంచిన ఈ కొత్త పాఠశాలలు పెరిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవసరాలను తీర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. ఈ 57 కొత్త కేంద్రీయ విద్యాలయాల ప్రారంభం, నిర్వహణ ఖర్చులతో మొత్తం 9 ఏళ్లకు దాదాపు రూ.5,862.55 కోట్లు ఖర్చు అవుతుందని అధికారుల అంచనా వేస్తున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాలకు మొత్తం 8 కొత్త కేంద్రీయ విద్యాలయాలు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రంలో కొత్తగా 4 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనుండటం శుభ పరిణామమని సీఎం చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లాలోని మంగళసముద్రం, బైరుగణిపల్లె, శ్రీకాకుళం జిల్లాలోని పలాస, అమరావతిలో శాఖమూరులో.. ఈ కొత్త విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ఇక తెలంగాణలోనూ 4 కొత్త కేవీలు రానున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఉన్న 35 కేంద్రీయ విద్యాలయాలు ఉండగా.. వీటికి తోడుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం (యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్), ములుగు జిల్లా కేంద్రం (గిరిజన ప్రాంతం), జగిత్యాల జిల్లా – జగిత్యాల రూరల్ మండలం చెల్గల, వనపర్తి జిల్లా – నాగవరం శివారులో ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.