ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. 14 ఏళ్లకే ఏకంగా బుర్జ్ ఖలీఫాలోనే AI కంపెనీ పెట్టేశాడు!
Jainam Jain AI Startup: సాధారణంగా 14 ఏళ్ల వయసులో పిల్లలు చదువుల్లో బిజీగా ఉంటారు. కానీ జైనమ్ జైన్ మాత్రం దుబాయ్‌లోని ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫాలో AI స్టార్టప్ ప్రారంభించి సంచలనం సృష్టించాడు. 105 రోజుల్లో 10వ తరగతి పూర్తి చేసిన ఈ టీనేజ్ వ్యవస్థాపకుడి విజయగాథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

సాధారణంగా 14 ఏళ్ల వయస్సులో పిల్లలు పాఠశాల చదువుల్లో బిజీగా ఉంటారు. కానీ అదే వయస్సులో జైనమ్ జైన్ అనే బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం ‘బుర్జ్ ఖలీఫా’లో తన కృత్రిమ మేధస్సు (AI) స్టార్టప్‌ను ప్రారంభించి అందరి దృష్టిని ఆకర్షించాడు. దుబాయ్‌లో AI రంగంలో కంపెనీ స్థాపించిన అత్యంత పిన్న వయస్కులైన వ్యవస్థాపకుల్లో జైనమ్ ఒకరిగా గుర్తింపు పొందాడు.
ఎవరు ఈ జైనమ్ జైన్?
జైనమ్ జైన్ ‘మెంగో ఇంజిన్ (Mengo Engine)’ అనే AI ఆధారిత స్టార్టప్‌కు వ్యవస్థాపకుడు. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా వ్యాపార సంస్థ మార్కెటింగ్, కస్టమర్ కమ్యూనికేషన్, సేల్స్ సపోర్ట్, కంటెంట్ క్రియేషన్ వంటి అనేక పనులను ఆటోమేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. చిన్న వయస్సులోనే దుబాయ్‌లో AI కంపెనీని స్థాపించడం ద్వారా జైనమ్ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు.
ఆరేళ్ల వయస్సులోనే మొదలైన వ్యాపార ఆసక్తి
జైనమ్ కథ ప్రకారం, అతని వ్యాపార ప్రయాణం ఆరేళ్ల వయస్సులోనే ప్రారంభమైంది. ఒకసారి తన తండ్రితో కలిసి వ్యాపార సమావేశానికి వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం అతడిని బాగా ఆకట్టుకుంది. అప్పటి నుంచి చదువుతో పాటు వ్యాపార సమావేశాలు, స్టార్టప్ ఈవెంట్లు, విజయవంతమైన పారిశ్రామికవేత్తలతో భేటీలు అతని దైనందిన జీవితంలో భాగమయ్యాయి. పుస్తకాల ద్వారా మాత్రమే కాకుండా ప్రత్యక్ష అనుభవాల ద్వారా కూడా నేర్చుకోవడంపై అతడు ఎక్కువ దృష్టి పెట్టాడు.
105 రోజుల్లోనే 10వ తరగతి పూర్తి
కేవలం 13 ఏళ్ల వయస్సులో జైనమ్ IGCSE 10వ తరగతి సిలబస్‌ను కేవలం 105 రోజుల్లో పూర్తి చేశాడు. స్టార్టప్ అభివృద్ధికి ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో వేగవంతమైన అభ్యాస పద్ధతిని అనుసరించాడు. తరగతి గది విద్యతో పాటు వాస్తవ జీవిత అనుభవాలు కూడా విజయానికి సమానంగా అవసరమని అతడు నమ్ముతాడు.
TEDx స్పీకర్.. రెండు పేటెంట్లు.. రచయిత కూడా
స్టార్టప్‌ను నడపడమే కాకుండా జైనమ్ ఇప్పటివరకు ఒక TEDx వేదికపై ప్రసంగించాడు. అతని పేరుపై రెండు పేటెంట్లు ఉన్నాయి. అంతేకాకుండా ఒక పుస్తకాన్ని కూడా రచించాడు. అతని యూట్యూబ్ ఛానెల్‌కు ఇప్పటికే 1.45 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
10 ఏళ్ల నుంచే 50 రోజుల ఛాలెంజ్‌లు
జైనమ్ 10 ఏళ్ల వయస్సు నుంచే తనకు తానే 50 రోజుల వ్యక్తిగత ఛాలెంజ్‌లు పెట్టుకునేవాడట. ఈ ఛాలెంజ్‌లలో భాగంగా 50 పుస్తకాలు చదవడం, 50 బిజినెస్ ఈవెంట్లకు హాజరుకావడం, భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు సుమారు 6,000 కిలోమీటర్లు ప్రయాణించి వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులను కలవడం వంటి లక్ష్యాలను పూర్తి చేశాడు.
ప్రపంచ స్థాయి సంస్థే లక్ష్యం
భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే సంస్థను నిర్మించడమే తన లక్ష్యమని జైనమ్ చెబుతున్నాడు. విజయానికి వయస్సు కంటే ఆలోచనలు, క్రమశిక్షణ, నిరంతర కృషి ముఖ్యమని అతని అభిప్రాయం. అతని ప్రయాణం ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, వ్యాపార వర్గాల్లోనూ విస్తృత చర్చకు దారితీస్తోంది. చిన్న వయస్సులోనే పెద్ద లక్ష్యాలను సాధించవచ్చని జైనమ్ జైన్ నిరూపిస్తున్నాడని పలువురు ప్రశంసిస్తున్నారు.




