
కేంద్ర బడ్జెట్ ప్రకటనకు సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మరో 10 రోజులు మాత్రమే సమయం ఉండటంతో బడ్జెట్‌పై సామాన్య, మధ్యతరగతి, వ్యాపార వర్గాల్లో అంచనాలు పెరుగుతున్నాయి. సామాన్యులు ప్రభుత్వ పథకాలు ఆశిస్తుండగా.. మధ్యతరగతి ప్రజలు ట్యాక్స్‌ల్లో మరింత మినహాయింపుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక వ్యాపార వర్గాలు పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు, మినహాయింపులు, జీఎస్టీ రేట్లలో సవరింపుల గురించి అనేక డిమాండ్లు చేస్తున్నారు. ప్రముఖంగా అందరూ ఆదాయపు పన్ను మినహాయింపుల గురించే చర్చించుకుంటున్నారు. ఈ సారి ఇన్‌కమ్ ట్యాక్స్ విధానంలో ఎలాంటి రిలీఫ్‌లు ఉంటాయనే దానిపై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్రం ఓ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.
ప్రస్తుతం ఆదాయపు పన్నులో రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి పాత రెజిమ్ కాగా.. రెండోవది కొత్త రెజిమ్. దేశంలో ఎప్పటినుంచో ఈ రెండు విధానాలు మాత్రమే అమలవుతున్నాయి. ట్యాక్స్ చెల్లింపులు, రిటర్న్స్, మినహాయింపులు, రాయితీలు పొందేందుకు చెల్లింపుదారులు వీటిల్లో ఏదైనా ఎంచుకోవచ్చు. అయితే ఆదాయపు పన్ను వ్యవస్థను ఏకీకృతం చేసేందుకు ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలని కేంద్రం చూస్తోంది. పాతవారిని కొత్త పన్ను విధానంలోకి మళ్లించాలని ఎప్పటినుంచో చూస్తోంది. ఇందులో భాగంగా ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్‌ను దశలవారీగా తొలగించేలా బడ్జెట్‌లో కీలక ప్రకటన ఉంటుందని ప్రచారం సాగుతోంది.
కొత్త, పాత పన్ను విధానాలను పోల్చి చూస్తే చాలా మార్పులు ఉన్నాయి. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్‌తో పోలిస్తే కొత్త ట్యాక్స్ రెజిమ్ అధిక స్థాయి ఆదాయంలో తక్కువ పన్ను రేట్లను కలిగి ఉంది. అలాగే తగ్గింపులు, మినహాయింపులు తక్కువగా ఉన్నాయి. కొత్త పన్ను విధానంలో రూ.12.75 లక్షల్లోపు ఆదాయం పొందేవారు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే నెలకు రూ.లక్ష సంపాదనపై జీరో ట్యాక్స్ ఉంటుంది. పాత పన్ను విధానంలో తగ్గింపులు, మినహాయింపులు ఎక్కువగా ఉంటాయి. దీంతో కొత్త ట్యాక్స్ రెజీమ్‌ను లాభదాయకంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
పాత ఇన్‌కమ్ ట్యాక్స్ రెజీమ్‌లో సెక్షన్ 80సీ కింద ప్రావెడెంట్ ఫండ్, పీపీఎఫ్ వంటి పెట్టుబడులపై రూ.1.5 లక్షల వరకు, హెల్త్ ఇన్యూరెన్స్ కోసం సెక్షన్ 80డీ కింద, ఎన్‌పీఎస్, హౌస్ రెంట్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ అలవెన్స్, బ్యాక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీపై సెక్షన్ 80 టీటీఏ క్రింద, హౌస్ లోన్ వడ్డీపై పలు పన్ను ప్రయోజనాలు ఉన్నాయి.