
ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు కొద్ది నెలల క్రితం ఆకాశాన్నంటాయి. ఫిబ్రవరి నెలాఖరు నుంచి క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడం మొదలుపెట్టాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై దీని ప్రభావం పడుతోంది. అన్ని దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగ్గా.. భారత్‌లో కూడా ఇంధన ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇంధనం 80 శాతం చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. విదేశాలపై భారత్ ఆధారపడటం వల్ల మరింత ప్రభావం పడింది. అయితే జూన్ 18న ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంపై సంతకాలు చేయడం, హర్ముజ్ జలసంధి తెరుచుకోవడంతో చమురు ధరలు దిగొస్తున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా త్వరలో తగ్గుతాయని సామాన్యులు ఆశిస్తున్నాయి. ఇతర దేశాల్లో కూడా ధరలు పడిపోవడంతో.. దేశంలోనూ తగ్గవచ్చని చెబుతున్నారు.
యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అయితే మార్చి,ఏప్రిల్ నెలల్లో ధరలను కేంద్రం పెంచలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత మే నెలలో ప్రభుత్వం నాలుగుసార్లు ధరలను పెంచింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.7.5 మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయినా కూడా ఇతర దేశాలన్నింటితో పోలిస్తే భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా పెరిగాయి.
యుద్ధ సమయంలో దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను చవిచూశాయి. ధరలను పెంచినా, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి సమయం పడుతుంది. కేంద్రం మార్చి నెలాఖరులో పెట్రోల్, డీజిల్‌పై సుంకాన్ని రూ.10 తగ్గించింది. ప్రభుత్వం ఆ లోటును కూడా భర్తీ చేయాలనుకుంటుంది. దీంతో వెంటనే పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు ఉండదని ఆర్ధిక రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ధరలు తగ్గవని, కొన్ని రోజుల తర్వాత తగ్గించే అవకాశముందని అంటున్నారు.
ఇంధన ధరలు పెరగడం వల్ల ప్రభుత్వానికి లాభం చేకూరుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినా కూడా ప్రభుత్వానికి లాభమే. ధరలు తగ్గడం వల్ల వినియోగం పెరుగుతుంది. ధరలు తక్కువగా ఉంటే వినియోగదారులు మునుపటి కంటే ఎక్కువ పెట్రోల్, డీజిల్ కొంటారు. దీనివల్ల ప్రభుత్వ పన్ను రాబడి పెరుగుతుంది. ఇంధన ధరలు తగ్గితే, చిల్లర ధరల పెరుగుదల కూడా తగ్గుతుంది. ఆహార ధరలు కూడా తగ్గుతాయి. ధరల తగ్గింపు కోసం సామాన్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీని వల్ల అదనపు ఖర్చు అవుతుంది.