ఆధార్, ఓటర్ ఐడీ ఉచితం.. మరి పాస్‌పోర్ట్‌కు మాత్రం డబ్బులెందుకు కట్టాలి? ఇదిగోండి సమాధానం..!

ఆధార్, ఓటర్ ఐడీ ఉచితంగా లభిస్తే పాస్‌పోర్ట్‌కు ఎందుకు ఫీజు? ఈ ప్రశ్నకు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఇ-పాస్‌పోర్ట్ బుక్‌లెట్లు, పోలీస్ వెరిఫికేషన్, కొరియర్, సాంకేతిక నిర్వహణ వంటి ఖర్చుల వల్లే ఫీజు పెంచినట్లు తెలిపింది. సాధారణ పాస్‌పోర్ట్ ధర 2,500, తత్కాల్ ఫీజు 5,000గా నిర్ణయించారు.

ఆధార్, ఓటర్ ఐడీ ఉచితం.. మరి పాస్‌పోర్ట్‌కు మాత్రం డబ్బులెందుకు కట్టాలి? ఇదిగోండి సమాధానం..!
Passport

Updated on: Aug 04, 2026 | 1:31 PM

ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ వంటి ముఖ్యమైన గుర్తింపు పత్రాలు ఉచితంగా లభిస్తున్నప్పుడు, పాస్‌పోర్ట్ పొందడానికి మాత్రం ఎందుకు వేల రూపాయలు చెల్లించాల్సి వస్తుందనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ఇటీవల పాస్‌పోర్ట్ రుసుములను పెంచిన నేపథ్యంలో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సభ్యులు ఈ విషయంపై ప్రశ్నించగా, కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది.

పాస్‌పోర్ట్ ఫీజులు ఎందుకు పెంచారు?

పాస్‌పోర్ట్ సేవలను మరింత ఆధునికంగా, వేగవంతంగా, సురక్షితంగా మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం పెట్టుబడులు పెడుతోందని తెలిపింది. ఈ సేవలకు అయ్యే వ్యయం పెరగడంతో పాస్‌పోర్ట్ ఫీజులను కూడా కాలానుగుణంగా సవరిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు 1971, 1980, 1993, 2002, 2012 సంవత్సరాల్లో ఫీజులను సవరించగా, తాజా సవరణ జూన్ 2026లో అమల్లోకి వచ్చింది.

పాస్‌పోర్ట్ జారీకి అయ్యే ఖర్చులు

పాస్‌పోర్ట్ జారీ చేయడం కేవలం ఒక పుస్తకాన్ని ముద్రించడం మాత్రమే కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి దరఖాస్తుపై పాస్‌పోర్ట్ బుక్‌లెట్ తయారీ, వ్యక్తిగత వివరాల ముద్రణ, సేవా ప్రదాతలకు చెల్లింపులు, పోలీసు వెరిఫికేషన్ కోసం రాష్ట్ర పోలీసు శాఖలకు చెల్లించే రుసుము, తపాలా మరియు కొరియర్ సేవలు, ఐటీ వ్యవస్థల నిర్వహణ, సాంకేతిక మౌలిక సదుపాయాల నిర్వహణ, మరమ్మతులు వంటి అనేక అంశాలపై ఖర్చు అవుతుందని వెల్లడించింది.

ఇ-పాస్‌పోర్ట్‌తో ఖర్చులు మరింత పెరిగాయి

దేశవ్యాప్తంగా చిప్ ఆధారిత ఇ-పాస్‌పోర్ట్‌లను ప్రవేశపెట్టడంతో ఖర్చులు మరింత పెరిగాయని కేంద్రం తెలిపింది. ఈ బుక్‌లెట్ల తయారీని ఇండియా సెక్యూరిటీ ప్రెస్ (ISP) నిర్వహిస్తోందని, అధునాతన సెక్యూరిటీ ఫీచర్లు, ఎంబెడెడ్ చిప్, డిజిటల్ డేటా రక్షణ వంటి అంశాల వల్ల ఒక్కో పాస్‌పోర్ట్ తయారీ వ్యయం గణనీయంగా పెరిగిందని పేర్కొంది. సేవా ప్రదాతలకు చెల్లించే రుసుములు కూడా గత కొన్నేళ్లలో పెరిగాయని వివరించింది.

కొత్త ఫీజులు ఎంత?

తాజా సవరణల ప్రకారం.. 36 పేజీల సాధారణ పాస్‌పోర్ట్‌కు గతంలో రూ.1,500 ఉండగా, ఇప్పుడు రూ.2,500గా నిర్ణయించారు. అత్యవసర అవసరాల కోసం జారీ చేసే తత్కాల్ పాస్‌పోర్ట్ ఫీజు రూ.3,500 నుంచి రూ.5,000కు పెరిగింది. 60 పేజీల పాస్‌పోర్ట్ ధర రూ.3,500గా ఉంది. మైనర్లకు జారీ చేసే పాస్‌పోర్ట్ ఫీజు రూ.1,000 నుంచి రూ.1,750కు పెరిగింది.

పాస్‌పోర్ట్ సేవలను వేగంగా అందించడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భద్రతను పెంచడం, ఇ-పాస్‌పోర్ట్‌ల విస్తరణ, డిజిటల్ సేవల బలోపేతం వంటి లక్ష్యాలతో ఈ రుసుము సవరణ చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పాస్‌పోర్ట్ జారీ ప్రక్రియలో నాణ్యత, భద్రత, పారదర్శకతను మెరుగుపరచేందుకు అయ్యే వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని పార్లమెంట్‌లో స్పష్టం చేసింది. దీంతో ఆధార్ లేదా ఓటర్ ఐడీతో పోలిస్తే పాస్‌పోర్ట్‌కు ప్రత్యేక రుసుము ఎందుకు ఉంటుందనే ప్రశ్నకు ప్రభుత్వం అధికారిక వివరణ ఇచ్చినట్లైంది.

Loading...
Unable to load recommendations.
Follow Us