Gold: పసిడికి మాత్రమే ఎందుకింత క్రేజ్? ధర పెరిగినా డిమాండ్ తగ్గదు ఎందుకు? తెలియాలంటే ఇది చదవండి..

|

Aug 09, 2024 | 4:54 PM

బంగారం ధరలు ఏటేటా పెరిగిపోతూనే ఉన్నాయి. గత 10 నుంచి15 ఏళ్లో పది రెట్లకు పైగా రేటు పెరిగింది. అయినప్పటికీ దానిపై మోజు తగ్గదు. ఆందోళన చెందరు. ఎందుకంటే మనం బంగారంపై పెట్టే పెట్టుబడి ఎక్కడికీ పోదు అన్న ధీమా జనాల్లో ఉంది. ఆర్థిక సంక్షోభ సమయంలో కూడా బంగారం ఆదుకుంటుందన్న భరోసా ఉంటుంది.

Gold: పసిడికి మాత్రమే ఎందుకింత క్రేజ్? ధర పెరిగినా డిమాండ్ తగ్గదు ఎందుకు? తెలియాలంటే ఇది చదవండి..
Gold
Follow us on

బంగారానికి ఎందుకంత ప్రత్యేకత? దానిలో ఏముంది? దానికెందుకు అంత విలువ? ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? నిజమే మన దేశంలో బంగారానికన్న ఇంకా విలువైన లోహాలు ఉన్నా.. బంగారానికి ఉన్న ప్రాధాన్యం వాటికి రాదు. ఏ శుభకార్యమైనా.. వేడుకైనా బంగారమే ప్రాధాన్యం. భారతీయ వివాహ వేడుకల్లో మహిళలే కాక పురుషులు కూడా బంగారాన్ని ధరిస్తారు. అంతేనా.. కేవలం ఆభరణంగానే బంగారాన్ని వినియోగిస్తామా? కాదు అంతకుమించి దాని ప్రయోజనాలున్నాయి అందుకే ప్లాటినం, పెలాడియం వంటి లోహాల కన్నా బంగారానికి అధిక ప్రాధాన్యం ఇస్తాం. బంగారాన్ని పెట్టుబడిగా కూడా వినియోగిస్తాం. మరోవైపు బంగారం ధరలు ఏటేటా పెరిగిపోతూనే ఉన్నాయి. గత 10 నుంచి15 ఏళ్లో పది రెట్లకు పైగా రేటు పెరిగింది. అయినప్పటికీ దానిపై మోజు తగ్గదు. ఆందోళన చెందరు. ఎందుకంటే మనం బంగారంపై పెట్టే పెట్టుబడి ఎక్కడికీ పోదు అన్న ధీమా జనాల్లో ఉంది. ఆర్థిక సంక్షోభ సమయంలో కూడా బంగారం ఆదుకుంటుందన్న భరోసా ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్..

బంగారానికి మన దేశంలో ఎంత క్రేజ్ ఉందో ప్రపంచ వ్యాప్తంగా కూడా అంతే డిమాండ్ ఉంది. వాస్తవానికి బంగారం శక్తి, రాజభోగాలు, సంపదకు చిహ్నం. బంగారాన్ని వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. గతంలో బంగారం వాణిజ్యం, అంతర్గత వ్యవహారాలకు కూడా ఉపయోగించే వారు. పూర్వ కాలంలో కొంతమంది రాజులు బంగారాన్ని కరెన్సీగా ఉపయోగించారు. బంగారు నాణేలతో వర్తకం చేసేవారు. కరెన్సీ విషయంలో ఆంక్షలు ఉంటాయి. ఏదేశానికి చెందిన కరెన్సీ అంటే నోట్లు నాణేలు ఆ దేశంలోనే వాడాలి. అయితే బంగారానికి అలాంటి నిబంధనేది ఉండదు. ఏ దేశంలో అయినా బంగారంతో లావాదేవీలు జరపొచ్చు.

దీని వల్ల ఒక దేశపు కరెన్సీ విలువ తగ్గిపోతే బంగారాన్ని కరెన్సీగా ఉపయోగించవచ్చు. అందువల్ల, అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు ఎల్లప్పుడూ తమ వద్ద బంగారు నిల్వలను ఉంచుతాయి. చాలా దేశాలు బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటాయి. భారతదేశం కూడా స్వేచ్ఛా ఆర్థిక వ్యవస్థను స్వీకరించడానికి ముందు టన్నుల కొద్దీ బంగారాన్ని తాకట్టు పెట్టవలసి వచ్చింది.

ధర ఎవరు నిర్ణయిస్తారంటే..

బంగారం రేటు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నా.. దానికున్న డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే బంగారం ధరను ఎవరు నిర్ణయిస్తారు? ఈ ప్రశ్న చాలా మందికి వచ్చే ఉంటుంది. బంగారం ధరను ఒక సంస్థ కానీ, ఒక ప్రభుత్వం కానీ నిర్ణయించదు. సాధారణ మార్కెట్ పై ఆధారపడి బంగారం ధర ఉంటుంది. వాస్తవానికి బంగారం వెలికి తీయాలంటే చాలా శ్రమతో కూడుకున్నది. పైగా ప్రాసెసింగ్ కూడా చాలా ఖర్చు అవుతుంది. అందువల్ల దీని ధర అధికంగా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 200 కోట్ల డిపాజిట్ కలిగి ఉంది. అయితే ఈ రూ.200 కోట్లలో కేవలం నగదు మాత్రమే ఉండదు. ఇందులో ఎక్కువ భాగం బంగారమే ఉంటుంది. ఈ 200 కోట్ల డిపాజిట్‌లో రూ. 115 కోట్ల విలువైన బంగారం ఉంది. మిగిలినది ఇతర దేశాల కరెన్సీ.

పరిశ్రమల్లో విరివిగా ఉపయోగం..

బంగారాన్ని కరిగించి దానికి ఎలాంటి ఆకారాన్నైనా తయారు చేయొచ్చు. ఇది హై గ్రేడ్ ఎలక్ట్రానిక్స్, డెంటిస్ట్రీ, మెడికల్, డిఫెన్స్ ఏరోస్పేస్ పరిశ్రమల్లో వాడుతారు. ఆటోమోటివ్ పరిశ్రమలో కూడా బంగారాన్ని వినియోగిస్తున్నారు. బంగారంతో చేసిన ఏ వస్తువు అయినా ఆకర్షిస్తుంది. ఈ లోహం ఎప్పుడూ తుప్పు పట్టదు. బంగారం చాలా సంవత్సరాలు ఉంటుంది. అనేక తీపి పదార్ధాలు మరియు ఔషధాలకు బంగారు ఆకుతో పూత పూస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..