
ప్రపంచవ్యాప్తంగా ఒక నిశ్శబ్ద విప్లవం జరుగుతోంది. సామాన్యులు పెరుగుతున్న బంగారం ధరలను చూసి ఆందోళన చెందుతుంటే శక్తివంతమైన దేశాల కేంద్ర బ్యాంకులు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా తమ ఖజానాలను పసిడితో నింపేస్తున్నాయి. ఇది కేవలం పెట్టుబడి మాత్రమేనా..? లేక ప్రపంచాన్ని వణికించబోయే ఏదో పెద్ద విపత్తుకు ఇది సన్నాహమా?. మాజీ US ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ అలాన్ గ్రీన్‌స్పాన్ అన్నట్టు.. డిజిటల్ కరెన్సీలు, కాగితపు నోట్లపై నమ్మకం తగ్గినప్పుడు ప్రపంచం మొత్తం ఆశ్రయించే ఏకైక సురక్షిత తీరం బంగారం. అందుకే దేశాలు తమ ఆర్థిక భద్రత కోసం, కరెన్సీ విలువను కాపాడుకోవడం కోసం అధికారిక బంగారు నిల్వలను పెంచుకుంటున్నాయి.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా లెక్కల ప్రకారం, ప్రపంచంలోనే అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశాల జాబితా
ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ రాజకీయాలు మారిపోయాయి. పాశ్చాత్య దేశాల ఆంక్షల నుండి తప్పించుకోవడానికి రష్యా డీ-డాలరైజేషన్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. చైనా కూడా తన వద్ద ఉన్న US ట్రెజరీ బాండ్లను తగ్గించుకుంటూ బంగారాన్ని పోగుచేస్తోంది. హంగేరీ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ చెప్పినట్లుగా..”బంగారం ఇప్పుడు లాభాల కోసం కాదు, జాతీయ వ్యూహం కోసం.”
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి.
భౌగోళిక ఉద్రిక్తతలు: రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఘర్షణలు పెట్టుబడిదారులను సురక్షితమైన బంగారం వైపు నడిపిస్తున్నాయి.
మాంద్యం భయాలు: ఆర్థిక వ్యవస్థలు ఒడిదుడుకులకు లోనైనప్పుడు పసిడి రక్షణ కవచంలా పనిచేస్తుంది.
కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు: 2022-23లో రికార్డ్ స్థాయిలో బ్యాంకులు 1000 టన్నులకు పైగా బంగారాన్ని కొనడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు పెరిగాయి.
భారతదేశానికి బంగారం పట్ల ఉన్న ప్రేమ ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. అయితే మన వద్ద ఉన్న 800-900 టన్నుల అధికారిక నిల్వలు, మన జనాభా, ఆర్థిక అవసరాలతో పోలిస్తే తక్కువేనని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్ బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది తప్ప ఉత్పత్తి చేయదు. ధర పెరిగే కొద్దీ మన దిగుమతి బిల్లు పెరిగి, రూపాయిపై ఒత్తిడి పడుతుంది. ప్రజలు భౌతిక బంగారం కొనే బదులు గోల్డ్ బాండ్లు, ఈటీఎఫ్‌ల (ETF) వైపు మళ్లాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీనివల్ల దేశ విదేశీ మారక నిల్వలు ఆదా అవుతాయి.
బంగారం ఇకపై కేవలం అలంకరణ వస్తువు కాదు. అది ఒక భౌగోళిక రాజకీయ ఆయుధం. అమెరికా నుండి చైనా వరకు అగ్రరాజ్యాలన్నీ రాబోయే ఆర్ధిక తుఫాను కోసం సిద్ధమవుతున్నాయి. మరి ఈ పసిడి రేసులో భారత్ తన వ్యూహాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందా? సామాన్యుడి సెంటిమెంట్‌ను దేశ ఆర్థిక శక్తిగా మార్చడంలో మనం ఎంతవరకు విజయం సాధిస్తాం అన్నదే ఇప్పుడు మిగిలి ఉన్న ప్రశ్న.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి