
ఇప్పటివరకు క్రెడిట్ కార్డ్ అంటే ప్రత్యేక కార్డు ఉండేది. ఇక డెబిట్ కార్డ్‌కు ప్రత్యేక కార్డ్ ఉండేది. కానీ త్వరలో రెండింటికి ఒకే కార్డు రానుంది. ఈ మేరకు క్రెడిట్, డెబిట్ కార్డులు జారీ చేసే సంస్థల్లో ఒక్కటైన వీసా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటివరకు ప్రతీ దానికి ప్రత్యేక కార్డులు ఉండటం వల్ల బ్యాంక్ కస్టమర్లకు మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. పర్సు మొత్తం కార్డులతో నిండిపోతుంది. రాబోయే రోజుల్లో ఈ సమస్య తప్పనుంది. క్రెడిట్, డెబిట్ కార్డు ఉపయోగానికి క్రెడిట్ కమ్ డెబిట్ కార్డులను తీసుకురానున్నట్లు కార్డుల జారీ నెట్‌వర్క్ సంస్థ వీసా వెల్లడించింది. ఇప్పటికే జపాన్‌లో తీసుకురాగా.. త్వరలో భారత్‌లోనూ ఈ కార్డులను జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
కొంతమంది నాలుగైదు బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉంటున్నారు. దీని వల్ల నాలుగైదు డెబిట్ కార్డులు ఉంటున్నాయి. అలాగే నాలుగైదు క్రెడిట్ కార్డులను కూడా వినియోగిస్తున్నారు. దీని వల్ల అన్ని కార్డులను పర్సులో క్యారీ చేయడం కష్టమవుతుంది. దీనిని చెక్ పెట్టేందుకు వీసా ఫ్లెక్సిబుల్ క్రెడిన్షియల్ పేరుతో ఒకే కార్డులో రెండు సేవలు ఉపయోగించుకేలా కొత్త పద్దతిని తీసుకొస్తుంది. ఈ కార్డు ద్వారా చిన్న లావాదేవీలకు డెబిట్ కార్డు, పెద్ద మొత్తాలకు క్రెడిట్ కార్డు ఉపయోగించుకునే బ్యాంకుల యాప్స్‌లో సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఈ కార్డును ఫారెక్స్, ప్రీపెయిడ్ కార్డు గానూ వినియోగించుకోవచ్చు. వేర్వేరు అవసరాలకు ప్రత్యేక కార్డులు వాడాల్సిన అసవరం లేకుండా ఒకే కార్డు విధానాన్ని తీసుకొచ్చినట్లు వీసా సంస్థ పేర్కొంది.
ఇప్పటికే జపాన్‌లో 50 లక్షల మంది ఈ కార్డులను వాడుతుండగా.. వియాత్నంలోనూ ఇలాంటి కార్డులను వీసా ప్రవేశపెట్టింది. త్వరలో భారత్‌లో కూడా ఈ కార్డులను మనం చూడవచ్చన్నమాట. ఇప్పటికే ఆర్బీఐ అనుమతి కోసం వీసా సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఆర్బీఐ, ఇతర నియంత్రణ సంస్థల నుంచి అనుమతి వచ్చాక వీటిని ఇండియాలో అధికారికంగా లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఇండియాలోని బ్యాంకులతో భాగ్యస్వామ్యంతో ఈ కార్డులను తీసుకురానుంది. ఇప్పటికే దేశంలోని ప్రైవేట్ బ్యాంక్ అయిన ఇండస్ ఇండ్ ఇలాంటి కార్డులను తీసుకొచ్చింది. ఒకే కార్డుపై ముందువైపు ఒక చిప్, వెనుకవైపు మరో చిప్ ఉంటుంది. ఇరువైపులా రెండు వేర్వేరు నెంబర్లు ఉంటాయి. ఇది ఒకవైపు డెబిట్.. మరోవైపు క్రెడిట్ కార్డులా పనిచేస్తుంది. వీసా కొత్తగా తీసుకొస్తున్న కార్డులతో త్వరలో అన్ని బ్యాంకుల్లో మనం ఇలాంటి కార్డులను చూడవచ్చు.