
మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని పునర్వ్యవస్థీకరించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. డీమెర్జర్ ప్రక్రియకు సంబంధించి కంపెనీ కీలకమైన రికార్డు తేదీని ప్రకటించడంతో, మంగళవారం స్టాక్ మార్కెట్లో ఈ షేరు ఒక్కసారిగా జూలు విదిల్చింది. ట్రేడింగ్ సెషన్‌లో ఈ స్టాక్ రూ.794.90 వద్ద తన జీవితకాల గరిష్ట స్థాయిని తాకి సరికొత్త రికార్డు సృష్టించింది. వేదాంత డీమెర్జర్ కోసం రికార్డు తేదీని 2026 మే 1గా నిర్ణయించారు. అయితే మే 1న మార్కెట్ సెలవు ఉన్నందున, డీమెర్జర్ ప్రయోజనాలు పొందాలనుకునే ఇన్వెస్టర్లు ఏప్రిల్ 29లోపు షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఈ డీమెర్జర్ ప్లాన్ ప్రకారం.. వేదాంత లిమిటెడ్ ఐదు విభిన్న కంపెనీలుగా విడిపోనుంది. ప్రస్తుతం మీ దగ్గర వేదాంత లిమిటెడ్ యొక్క ఒక షేరు ఉంటే, విభజన తర్వాత ఏర్పడే ఈ 5 కంపెనీలలో ఒక్కో షేరును పొందుతారు..
వేదాంత స్టాక్ గత ఆరు నెలల్లోనే 61 శాతం, గత ఐదేళ్లలో 234 శాతం భారీ రాబడిని ఇచ్చి ఇన్వెస్టర్లలో సరికొత్త జోష్‌ను నింపింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ అనలిస్ట్ అన్షుల్ జైన్ షేరుకు బై రేటింగ్ ఇచ్చారు.
టార్గెట్ ధర: రూ.850
స్టాప్ లాస్: రూ. 730
మొత్తం డీమెర్జర్ ప్రక్రియను జూన్ 30 నాటికి పూర్తి చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కొన్ని ప్రభుత్వ అనుమతులు రావాల్సి ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లు మాత్రం దీనిని ఒక సువర్ణ అవకాశంగా భావిస్తున్నారు. 2021లో రూ. 65 వద్ద ఉన్న షేరు ధర నేడు రూ. 800 దరిదాపుల్లో ఉండటం కంపెనీ వృద్ధికి నిదర్శనం.