వందే భారత్‌లో ఆహారంపై ప్రయాణికుడి ఫిర్యాదు! IRCTCకి రూ.10 లక్షల జరిమానా

ఇండియన్ రైల్వేస్ ప్రయాణికుల సేవలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో నాసిరకం ఆహారం అందించినందుకు IRCTCపై రూ.10 లక్షల భారీ జరిమానా విధించింది. సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌ కాంట్రాక్టును రద్దు చేసి, రూ.50 లక్షలు వసూలు చేశారు. గత మూడేళ్లలో రూ.2.6 కోట్ల జరిమానాలు వసూలు చేశారు.

వందే భారత్‌లో ఆహారంపై ప్రయాణికుడి ఫిర్యాదు! IRCTCకి రూ.10 లక్షల జరిమానా
Vande Bharat 2

Updated on: Mar 26, 2026 | 3:25 PM

ప్రయాణికుల సేవల నాణ్యతపై కఠిన వైఖరిని అవలంబిస్తున్న ఇండియన్‌ రైల్వేస్‌ తన అనుబంధ సంస్థ IRCTCపై భారీ జరిమానా విధించింది. పాట్నా–టాటానగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం.21896)లో అందించిన ఆహార నాణ్యతపై ఒక ప్రయాణికుడు చేసిన ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన రైల్వే శాఖ, IRCTCపై రూ.10 లక్షల జరిమానా విధించింది. ఈ ఘటన మార్చి 15న చోటుచేసుకుంది. విచారణలో ఆహార నాణ్యత లోపాలు ఉన్నట్లు తేలడంతో సంబంధిత సర్వీస్ ప్రొవైడర్‌పై మరింత కఠిన చర్యలు తీసుకున్నారు. అతనిపై రూ.50 లక్షల జరిమానా విధించడంతో పాటు, కాంట్రాక్టును రద్దు చేయాలని ఆదేశించారు. ప్రయాణికుల భద్రత, సేవల నాణ్యత తమకు అత్యంత ప్రాధాన్యత అని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

రైల్వే మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా రైళ్లలో ప్రతి సంవత్సరం సుమారు 58 కోట్ల భోజనాలను అందిస్తున్నారు. ఈ భారీ స్థాయిలో సేవల మధ్య ఫిర్యాదుల శాతం కేవలం 0.0008 శాతం మాత్రమేనని పేర్కొంది. అయినప్పటికీ వచ్చిన ప్రతి ఫిర్యాదును గంభీరంగా పరిగణించి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. గత మూడు సంవత్సరాల్లో ఇలాంటి కేసులపై మొత్తం రూ.2.6 కోట్ల జరిమానాలు విధించినట్లు వెల్లడించింది. ఇక భద్రతా అంశాలపైనా రైల్వే దృష్టి పెడుతోంది. 2025లో ప్యాంట్రీ కార్ సిబ్బంది ప్రయాణికులపై దాడి చేసిన మూడు సంఘటనలు నమోదవగా, సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, సంస్కరణల దిశగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కీలక ప్రకటన చేశారు. రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్ కార్యక్రమంలో భాగంగా మరో ఐదు కొత్త సంస్కరణలకు ఆమోదం లభించిందని తెలిపారు. దీంతో 2026లో మొత్తం సంస్కరణల సంఖ్య తొమ్మిదికి చేరింది. వీటిలో సరుకు రవాణా, నిర్మాణ రంగం, ప్రయాణికుల సౌకర్యాలకు సంబంధించిన మార్పులు ఉన్నాయి. ఉప్పు రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, దేశంలో ఉత్పత్తి అయ్యే 3.5 కోట్ల టన్నుల ఉప్పులో సుమారు 92 లక్షల టన్నులు మాత్రమే రైల్వేల ద్వారా రవాణా అవుతున్నాయని మంత్రి వెల్లడించారు. ఈ రంగంలో మరింత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us